Monday, December 23, 2024

కుత్బుల్లాపూర్ భూకబ్జా.. ప్రభుత్వ భూమిలో కెఎల్ యూనివర్సటీ!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: ప్రభుత్వ భూమిని అప్పనంగా ఆక్రమించుకుని, అందులో భవనాలను నిర్మించి కళాశాలను నడుపుతున్న కెఎల్ యూనివర్సిటీపై స్థానికంగా పలురకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమిలోనే కెఎల్ యూనివర్సిటీ భవనాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ, భవనాలు వెలిసే సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అనేదానికి అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదనేది పలు అనుమానాలకు తావిస్తున్నట్టు స్థానిక రాజకీయ నాయకులు వ్యా ఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతమున్న రెవెన్యూ అధికారులు మాత్రం అది ప్రభుత్వ భూమి అని అయితే, కొన్నేళ్ల క్రితమే అక్కడ భవన నిర్మాణం జరిగిందని కెఎల్ యూనివర్సిటీ అర్జీపెట్టుకున్న విషయాన్ని తెలియజేస్తూ.. ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు తెలిసింది. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిలోకి యూనివర్సిటీ వచ్చి నిర్మాణాలు చేపట్టడంపై స్థానిక విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ యాజమాన్యం తీరును దుయ్యబడుతున్నాయి. ప్రభుత్వ భూమిలో కెఎల్ యూనివర్సిటీ చేపడుతున్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు అడ్డుకోకపోవడంపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నంబర్ 350లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టుపక్కల పలు భూములను కెఎల్ యూనివర్సిటీ కొనుగోలు చేసి పొజిషన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కెఎల్ యూనివర్సిటీ సదరు భూములను 2014 నుండి 2018 మధ్యలో కొనుగోలు చేసినట్లుగా ప్రచారంలో ఉన్నది. దీంతోపాటు ఆ సర్వే నెంబర్ ప్రక్కనే ఉన్న ఇతర భూముల్లో కూడా కెఎల్ యూనివర్సిటీ ఉన్నట్టు రెవెన్యూ అధికారుల్లోని అభిప్రాయం. గత పది సంవత్సరాలుగా యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వ భూముల్లోనే ఉన్నట్లుగా స్థానికులు వివరిస్తున్నారు.

రెవెన్యూ అధికారులు మాత్రం కెఎల్ యూనివర్సిటీకి ఎలాగైనా లబ్ధి చేయాలనే దిశగా నివేదికలను రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేయడంలేదనేది పలు రాజకీయ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా కుత్బుల్లాపూర్ తహాసీల్దార్ మాత్రం కెఎల్ యూనివర్సిటీ ఆధీనంలోనే ప్రభుత్వ భూమి గత కొన్నేండ్లుగా ఆక్రమణలో ఉన్నట్లు ప్రత్యేకంగా పేర్కొంటూ ఉన్నతస్థాయి అధికారులు అడిగిన మేరకు రిపోర్టును అందజేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూమిని రక్షించేది ఎవరు..?
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ అధికారులే ఆక్రమణలు చూస్తూ మౌనం వహిస్తే ఇక ఆ భూములను రక్షించేదెవరు..? అనేది స్థానికుల్లోని అసహనం.ఎకరాలకొద్దీ ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపడుతుంటే కెఎల్ యూనివర్సిటీ పేరు చెప్పి అధికారులు మౌనం ఉండటం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూమిని పరస్పర బదిలీ పేరిట ప్రైవేట్ విద్యాసంస్థకు అప్పజెప్పెందుకు అధికారుల సిద్ధమయ్యారనేది ప్రధాన ఆరోపణ. నీళ్లు వస్తున్న మా భూమిని తీసుకొని మా ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి కేటాయించాలంటూ మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే అధికారులు సానుకూలంగా స్పందించారంటూ, అదే పేదలకు, నిలువ నీడలేని కుటుంబాలకు భూమిని కేటాయించాలంటూ అర్జీలు పెట్టుకుంటే స్పందించడంలేదని స్థానిక సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే విలువైన స ర్కార్ స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంపై ఎఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ భూములను కెఎల్ యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రక్రియపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్నారనేది సాకుగా చూపిస్తూ..్ట కేఎల్ యూనివర్సిటీ కి భూమిని కట్టబెట్టొచ్చు అనే దోరణిలో అధికారులు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నివేదికను సిద్దం చేశారనే ప్రచారం జరుగుతోంది. పేదలు ఎవరైనా 60 గజాల ప్రభుత్వ స్థలంలో చిన్న రూమ్ వేస్తేనే ఆగమేఘాల మీద కూల్చివేతలు చేసి రెవెన్యూ అధికారులు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని దశబ్దాలుగా తన స్వాధీనంలో ఉంచుకున్నామని చెబుతున్న కెఎల్ యూనివర్సిటీ పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారనేది సిపిఐ విమర్శిస్తున్నది.

ఇతరుల పేరున?
2021-22 సంవత్సరం వరకు ఇతర రైతులపై ఉంది. సర్వేనెం. 354లో ఉన్న 15 ఎకరాల 30 గుంటల భూమి 2001 02 సంవత్సరం వరకు వివిధ రైతుల పేర్లపై రికార్డులో నమోదైనట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. గొల్ల పోయిన దాస్ పేరిట మూడు ఎకరాలు, సయ్యద్ ఇస్మాయిల్ పేరిట అయిదు ఎకరాలు, వెంకటేష్ యాదవ్ పేరిట 3 ఎకరాలు, పగడాల నరసింహ పేరిట ఒక ఎకరం, ఎం.కృష్ణ పేరిట ఒక ఎకరం, వజీర్ యాదయ్య పేరిట రెండు ఎకరాలు 30 గుంటలు ఉన్నట్లుగా 2001 సంవత్సరం వరకు రికార్డులో ఉన్నది. అయితే, వీరి పేరిట ఉన్న భూమిని కాస్త యూనివర్సిటీ ఏ విధంగా తమ ఆధీనంలో 30 సంవత్సరాలుగా ఉన్నట్టు చెబుతున్నది. దీనిపై రెవెన్యూ అధికారుల మౌనం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూమిలో ఉన్న యూనివర్సిటీకి వ్యతిరేకంగా స్పందించని రెవెన్యూ అధికారులు మాత్రం స్థానికంగా కొందరు రైతులపై మాత్రం కోర్టులో పోరాడటంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పోరాటం చేస్తాం: సిపిఐ
ప్రభుత్వ భూమిని కెఎల్ యూనివర్సిటీ కి కేటాయిస్తే పోరాటం తప్పదని సిపిఐ కార్యదర్శి ఉమా మహేష్ స్పష్టం చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి కోట్లు గడిస్తున్న కెఎల్ యూనివర్సిటీ కి విలువైన ప్రభుత్వ భూమిని కేటాయిస్తే ఊరుకునేది లేదన్నారు. ఏ ప్రతిపాదికన కెఎల్ యూనివర్సిటీ కి భూమిని బదిలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు, కెఎల్ యూనివర్సిటీ యాజమాన్యం లోపాయికారి ఒప్పందం మేరకే భూబదలాయింపు నివేదిక సిద్ధమైనట్టు అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉన్న కెఎల్ యూనివర్సిటీ పై చర్యలు తీసుకొని ఆ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ పథకాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని లేదా పేదలకు కేటాయించాలని ఉమా మహేష్ డిమాండ్ చేశారు. కెఎల్ ప్రైవేటు యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి కేటాయిస్తే ఊరుకునేది లేదనీ, విద్యను వ్యాపారంగా మార్చే ప్రైవేట్ కెఏల్ యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి కేటాయిస్తే పోరాటం తప్పదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ విద్యాసంస్థలు నెలకొల్పాలని, ప్రైవేట్ యూనివర్సిటీలకు కేటాయించరాదనీ ఎఐఎస్‌ఎఫ్ నాయకులు ప్ర శ్నించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చే సుకొని భూ మార్పిడి ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

కెఎల్ యూనివర్సిటీ ఆధీనంలోనే ప్రభుత్వ భూమి: తహాసీల్దార్ రెహమాన్
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ని మండల రెవెన్యూ పరిధిలోని గాజులరామారం సర్వే నెంబర్ 350లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే కెఎల్ యూనివర్సిటీ వారు ఉన్నారనీ కుత్బుల్లాపూర్ మండలం తహసీల్దార్ రెహ్మాన్ చెప్పారు. గత కొన్ని సంవత్సరాలు నుండి కెఎల్ యూనివర్సిటీ వారు 5 ఎకరాల్లో ప్రభుత్వ భూమిలోనే నిర్మాణాలు చేపట్టారని వెల్లడించారు. ఆ ప్రభుత్వ భూమిలో కళాశాల ఏర్పాటు చేసి చాలా కాలం అయినందున.. ఈ భూమికి బదులుగా మరో ప్రదేశంలో 5ఎకరాల భూమిని ఇస్తామని, అందుకు 350 సర్వే నెంబర్ లో 5ఎకరాలు కేటాయించాలని యూనివర్సిటీవారు కోర్టుకు వెళ్లినట్టు రెహ్మాన్ వివరించారు. ప్రభుత్వ భూమి ఎక్స్చేంజి కోసం వారికీ కెఎల్ యూనివర్సిటీకి ఇవ్వాలని గాని యూనివర్సిటీకి అనుకూలంగా గానీ ఎటువంటి నివేదికను పైస్థాయి అధికారులకు పంపలేదని తహసీల్దార్ రెహ్మాన్ తెలిపారు.

ప్రభుత్వ భూమిని ఎవరికైనా కేటాయించే అధికారం తహసీల్డార్ అయిన తనకు లేదని స్పష్టంగా తెలిపిన ఎమార్వో రెహ్మాన్ అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి పై మాత్రమే తాము ఉన్నతస్థాయి అధికారులకు నివేదికను అందించామనీ అన్నారు. కెఎల్ యూనివర్సిటీ భూమి కబ్జాలో ఎందుకు కూల్చివేతలు చేపట్టలేదనే దానిపై వివరణనిస్తూ& అది కోర్టులో కేసు ఉన్నందునే ఎటువంటి కూల్చివేత చేపట్టడం లేదని, త్వరలోనే కెఎల్ యూనివర్సిటీ భూ ఆక్రమణ కేసులో వేకెట్ పిటిషన్ వేసి అనంతరం నోటీసులు అందజేసి కూల్చివేతలు చేస్తామని చెప్పారు. ఈ విషయంలో కోర్ట్ తీర్పు గాని లేదా ప్రభుత్వం భూమి కేటాయించి జీవో ఇస్తే తప్ప భూమి కేటాయింపు జరుగదని అధికారులు యూనివర్సిటీకి అనుకూలంగా ఉన్నారు అని జరుగుతున్న పుకార్ల వాస్తవం కాదనీ, ఎవ్వరూ నమ్మొద్దని కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్ రెహమాన్ మనతెలంగాణ కు వివరణనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News