వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో 176 మంది మరణించిన వార్తను మరచిపోకముందే నార్వేలో మరొక ప్రమాదం సంభవించింద. కెఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నార్వే రాజధాని ఓస్లో టోర్ప్ శాండెఫ్‌జోర్డ్ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ తరువాత రన్‌వేపై జారిపోయింది. ఓస్లో విమానాశ్రయం నుంచి ఆమ్స్టర్డామ్కు బయలుదేరిన బోయింగ్ 737800 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ మొరాయించింది. దీనితో విమానాన్ని 110 కిలో మీటర్ల దూరంలోని శాండెప్జోర్డ్ విమానాశ్రయానికి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు. అక్కడ విమానం సురక్షితంగానే ల్యాండ్ అయింది. కానీ, ఆ తరువాత రన్‌వేపై విమానం జారిపోయి పక్కకు దూసుకువెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో నిలిచిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 182 మంది ఉన్నారు.
అయితే ఎవరికీ ఎటువంటి గాయాలూ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన వెంటనే మొబైల్ మెట్ల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. దక్షిణ కొరియాలో విమాన ప్రమాదం మృతులకు బోయింగ్ సంస్థ సంతాపం వ్యక్తం చేసింది. విమాన ప్రమాదం తరువాత దక్షిణ కొరియా జెజె ఎయిర్ సంస్థను సంప్రదించామని బోయింగ్ తెలిపింది. క్రితం నెల ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌కు వెళ్లవలసి ఉన్న కాంటాస్ ఎయిర్వేస్ విమానం టేకాఫ్ తరువాత ఇంజన్ వైఫల్యానికి గురై, కొద్ది సేపు వృత్తాకారంలో తిరిగి సిడ్నీ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని కాంటాస్ తెలియజేసింది. అది కూడా 19 ఏళ్ల నాటి బోయింగ్ 737800 విమానమే. కాగా, ఈ నెల 25న అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి కాస్పియన్ సముద్రం పశ్చిమ తీరంలోని గ్రోజ్నీకి వెళుతున్న విమానం కుప్పకూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.