కాంగ్రెస్ పార్టీ యోచన
త్వరలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు స్థానాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ రెండో తేదీతో రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్‌లు ఉన్నారు. ప్రస్తుతం శాసన సభలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం దృష్ట్యా ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. వాటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరాం కు కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కరీంనగర్‌లో ప్రొఫెసర్ కోదండరాం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన అధినాయకత్వం ప్రస్తుతానికి ఇవ్వలేమని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో ఖాళీ అయ్యే పోస్టుల్లో ఒకటి కోదండరాం కు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వంతో పేర్కొన్నట్టుగా సమాచారం. మరో పోస్టు కోసం భారీగానే పోటీ ఉందని తెలుస్తోంది. ఆ ఒక్క స్థానాన్ని ఎవరికీ కేటాయిస్తారన్నది సస్పెన్స్‌గామారింది. ప్రస్తుతం ఖమ్మం మాజీ ఎంపి రేణుకా చౌదరి, సంగారెడ్డి నుంచి ఓటమి పాలైన జగ్గారెడ్డిని రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారు లేదా వీరు కాకుండా వేరే వారికి అవకాశం ఇస్తారా అన్నది త్వరలోనే తేలనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.