Monday, December 23, 2024

కోడి పందాల్లో డిజిటల్ లావాదేవీలు

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ మనీట్రాన్స్‌ఫర్ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్
బరిని బట్టి, కోడిని బట్టి పందెం
జోరుమీద డైరెక్టు, ఇన్‌డైరెక్టు పందాలు
పెద్దబరుల్లో కనీసం రూ. లక్ష నుంచి పది లక్షల వరకు బెట్టింగ్
చిన్నబరుల్లో రూ. 5 వేల నుంచి 50 వేల వరకు బెట్టింగ్
కొందరు పందేంరాయుళ్ళకు కాసుల పంట
భారీగా నష్టపోతున్న మరికొందరు

 

మన తెలంగాణ, హైదరాబాద్: ఈసారి సంక్రాంతి కోడి పందాల్లో పందెంరాయుళ్ళు నేరుగా నగదు మార్పిడి పద్దతిని పక్కన పెట్టి డిజిటల్ లావాదేవీల బాట పట్టారు. నిర్వాహకులు బరుల వద్ద ప్రత్యేకంగా ఆన్‌లైన్ మనీట్రాన్స్‌ఫర్ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. బరిని బట్టి, కోడిని బట్టి పందాలు నిర్వహిస్తోన్నారు. డైరెక్టు పందాలు, ఇన్‌డైరెక్టు పందాలు జోరుగా సాగుతోన్నాయి. పెద్ద బరుల్లో అయితే రూ. లక్ష మొదలుకుని రూ. పది లక్షల పైబడి పందాలను కాస్తున్నారు. చిన్నబరుల్లో రూ. 5 వేలు నుంచి రూ. 50 వేల వరకు బెట్టింగ్ నడుస్తోంది. కొందరు పందెంరాయుళ్ళకు కాసులు పంట పండుతుంటే, మరికొందరు భారీగా నష్టపోతున్నారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు రూ. 450 కోట్ల వరకు బెట్టింగ్ నడిచినట్లు తెలుస్తోంది. అందులోనూ గోదావరి జిల్లాల్లో దాదాపు రూ. 300 కోట్లు పైబడి బెట్టింగ్ జరిగినట్లు సమాచారం.

పందెంరాయుళ్ళకు సకల సౌకర్యాలు

కోడి పందాల బరుల వద్ద గోవా కల్చల్ కనిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పందెంరాయుళ్ళు, విఐపిలు, వివిఐపిలకు సకల సౌకర్యాలను పందాల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. మరీముఖ్యంగా ఈ హడాహుడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని పందాల నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేశారు. బరిలోకి వచ్చే పందెంరాయుళ్ళకు క్యాసినో తరహా మర్యాదలు సిద్ధం చేశారు. పందెంరాయుళ్ళు అభిలాషకు అనుగుణంగా విఐపి, వివిఐపి వంటి మర్యాదలను చేస్తున్నారు. అలాగే విదేశీమద్యం, విందుభోజనంతో పాటు ఉదయం సాయంత్రం అల్పాహారం, టీ, కూల్ డ్రింక్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ఈసారి పెద్దగా ఆంక్షలు లేవు

పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ ఎపిలో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ మూడు రోజులు కోడిపందాలు తప్పక నడుస్తాయి. ఈసారి మాత్రం కోడిపందాలపై ప్రభుత్వం నుంచి పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో భారీగా కోడిపందాలు సాగుతోన్నాయి. పందాలకు అనుబంధంగా పేకాట, గుండాట శిబిరాలు కూడా భారీగా వెలిశాయి. కొన్ని చోట్ల అయితే ప్లడ్‌లైట్లు పెట్టి మరీ రాత్రులు పందాలను కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఢీ అంటే ఢీ అన్నట్లుగా జోరుగా కోడిపందాలు కొనసాగుతోన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 350 వరకు బరులు ఏర్పాటైతే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 250 వరకు కోడి పందాలా బరులు ఏర్పాటు చేశారు.

బరిలో గెలిస్తే బుల్లెట్ బండి, కారు బహుమతి

గోదావరి జిల్లాల్లో కోడి పందాల బరుల్లో గెలిస్తే బుల్లెట్ బండి, కారు బహుమతిగా ఇస్తున్నారు. కాకినాడ రూరల్ మండలంలోని వలసపాకలో పందాలను వీక్షించేందుకు అధికార వైసీపీ నేతలు ప్రత్యేకంగా పాసులను జారీ చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో కోడిపందాల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముమ్మిడివరం, కోడూరుపాడులోని బరులను పోలీసులు ధ్వంసం చేసినప్పటికీ అధికార వైసీపీ పార్టీ నేతలు మళ్ళీ కొత్త ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేసి కోడిపందాలను ఆడిస్తున్నారు. రావులపాలెంలో ఏర్పాటు చేసిన పందెంబరులు, శిబిరాలలోని బ్యారీకేడ్లను పోలీసులు తొలగించడంపై వైసీపీ ఎంఎల్‌ఎ చీర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మీకేంపని అంటూ పోలీసులను ఆయన నిలదీశారు. బరుల దగ్గర నుంచి వెళ్ళిపోవాలని పోలీసులను హెచ్చరించారు. దీంతో ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి తీరుపై ఉన్నతాధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. పత్తిపాడు మండలంలో వైసీపీకి చెందిన ఓ ఎంఎల్‌ఎ సమీపబంధువు బరులను ఏర్పాటు చేసి పందాలను ఆడిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News