హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలలో కోడి పందాల సందడి మొదలైంది. పోలీసుల హెచ్చరికలను సైతం పందెంరాయుళ్ళు లెక్కచేయడం లేదు. కోడిపందాలు, గుండాట, పేకాట శిబిరాలు జోరుగా సాగుతోన్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్న పందాల నిర్వహకులు పందెం బరులను సిద్ధం చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందాల హడాహుడి పది రోజుల కిందటే మొదలైపోయింది. ఇటు పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పందేలు ఊపందుకున్నాయి. పందాలకు స్థలాలు, తోటలను లీజుకు ఇచ్చే వారికి పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో పందాలకు సిద్ధమవుతున్న బరులను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా పందాలు జరిగే కైకులూరు, ఆకివీడు, భీమవరం చుట్టపక్కల ప్రాంతాల్లోని పందెం బరులను పోలీసులు ట్రాక్టర్లతో దున్నిస్తున్నారు. ఈసారి ఇప్పటికే 1500 మందిపై బైండోవర్ కేసులు ఫైల్ చేశారు. భారీగా కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయినా సరే కోడి పందాలపై ఉన్న ఆంక్షలను నిర్వహకులు లెక్క చేయడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కోడి పందాలు, పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.
జిల్లాలోని కంచిలి మండలం అంపూరం జాతీయ రహదారి సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందాల బరులపై దాడి చేసి 17 మందిని అదుపులోకి తీసుకుని, 7 కోడి పుంజులు, 21 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో పందెం బరులపై పోలీసులు దాడులు చేసి బరులను ట్రాక్టర్లతో దున్నించారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ, ఏర్పేడు, వరదయ్య పాళెం ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కోళ్ళపందాలు జరిగిపోతున్నాయి.