Friday, November 15, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన కోహ్లి..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఏకంగా 8 స్థానాలు మెరుగుపడి 13వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో కోహ్లి కళ్లు చెదిరే సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

దీంతో అతను ర్యాంకింగ్స్‌లో పైకి దూసుకెళ్లాడు. పేలవమైన ఫామ్‌తో టాప్20 ర్యాంకింగ్స్ నుంచి వైదొలిగిన కోహ్లి ప్రస్తుతం 13వ స్థానానికి చేరుకోవడం విశేషం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టాప్10లో చోటు సంపాదించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ పదో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 9వ ర్యాంక్‌కు పడిపోయాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయినా కూడా రిషబ్ టాప్10లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం.

మరోవైపు ఆస్ట్రేలియా బ్యాటర్ లబుషేన్ 915 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన స్టీవ్ స్మిత్ 872 పాయింట్లతో రెండో స్థానంలో, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) నాలుగో, ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు భారత్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుత సెంచరీతో అలరించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కివీస్‌కు చెందిన డారిల్ మిఛెల్ 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

అశ్విన్ ర్యాంక్ పదిలం..
మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో నిలకడైన బౌలింగ్‌ను కనబరిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అశ్విన్ 869 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 859 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పాట్‌కమిన్స్ (ఆస్ట్రేలియా) మూడో, కగిసో రబడా (సౌతాఫ్రికా) నాలుగో, షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలి రాబిన్సన్ ఆరో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. భారత స్పీడ్‌స్టర్ ఏడో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత్ సిరీస్‌లో నిలకడగా రాణించిన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని 8వ స్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తాజా ర్యాంకింగ్స్‌లో 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఎదురులేని జడేజా
ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో జడేజా 431 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్‌కే చెందిన రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌౦ మూడో ర్యాంక్‌లో నిలవగా భారత స్టార్ అక్షర్ పటేల్ నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

టీమ్ విభాగంలో ఆస్ట్రేలియా
టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమి పాలైనా ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టీమ్ 122 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకుంది. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో విజయం కంగారూలకు కలిసి వచ్చింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మొదటి ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. భారత్ 119 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో కలిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ మూడో, సౌతాఫ్రికా నాలుగో, న్యూజిలాండ్ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News