బిసిసిఐకి కోహ్లి ఝలక్?
ముంబై: భారత క్రికెట్‌లో ఇటీవల కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో బిసిసిఐ అనుసరించిన వైఖరీకి నిరసనగా కోహ్లి కఠిన నిర్ణయాలే తీసుకున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. ఈ పరిణామంతో బిసిసిఐ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వన్డే కెప్టెన్సీ విషయమై బిసిసిఐ వ్యవహరించిన తీరుపై కోహ్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అందుకే టెస్టు సారథ్య బాధ్యతల నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించాడు. ఇదిలావుండగా కోహ్లిని బుజ్జగించే పనిలో బిసిసిఐ పెద్దలు నిమగ్నమయ్యారు.
ఇప్పటికే కెరీర్‌లో 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి వందో మ్యాచ్‌కు ఒక అడుగు దూరంలో నిలిచాడు. ఇక త్వరలో సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌లో వందో మ్యాచ్‌కు సారథ్యం వహించాలని బిసిసిఐకి చెందిన ఓ కీలక అధికారి కోహ్లిని ఫోన్‌లో సంప్రదించాడు. అయితే బిసిసిఐ అభ్యర్థనను కోహ్లి తోసిపుచ్చినట్టు సమాచారం. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని కోహ్లి ఆ అధికారికి తేల్చి చెప్పేశాడు. ఇక కోహ్లి సేవలకు గుర్తింపుగా వందో టెస్టులో ఘనంగా సన్మానించాలని భావించిన బిసిసిఐకి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. ఇక బిసిసిఐపై కోహ్లి కోపం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.