లండన్: ఇంగ్లాండ్‌తో జరగాల్సిన అయిదో టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ కోరాడు. లేకపోతే అది మరిన్ని అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నాడు. ‘ఇంతకు ముందు కూడా మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడానికి ముందు రోజు రాత్రి కోహ్లీ బిసిసిఐకి లేఖ రాశాడు. కాబట్టి మ్యాచ్ రద్దు కావడానికి దారి తీసిన పరిస్థితులపై అతను వివరణ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఐపిఎల్ కారణంగానే మ్యాచ్ ను రద్దు చేసి ఉంటే .. నాలాంటి టెస్టు క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసినట్లే. ఎందుకంటే గతంలో టెస్టు క్రికెట్ ఎంత ముఖ్యమో కోహ్లీ చెప్పాడు’ అని గోవర్ పేర్కొన్నాడు.
కాగా టీమిండియా శిబిరంలో సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంతో ఈ నెల 10నుంచి ఇంగ్లాండ్‌తో జరగాల్సిన చివరి టెస్టు రద్దయిన విషయం తెలిసిందే. మరోవైపు ఐదో టెస్టు రద్దయిన తర్వాత ఐపిఎల్ కోసం దుబాయి చేరుకున్న విరాట్ కోహ్లీ ‘ఆర్‌సిబి బోల్డ్ డైరీస్’లో మాట్లాడాడు. ఐపిఎల్ కోసం త్వరగా దుబాయి చేరుకోవడం దురదృష్టకరం. కానీ కరోనా వల్ల అనిశ్చితి ఎక్కువగా ఉంది. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. ఐపిఎల్‌లో బయో బబుల్ అత్యంత సురక్షితంగా ఉంటుందని, నాణ్యమైన టోర్నీని చూస్తామని ఆశిస్తున్నా’ అని కోహ్లీ అన్నాడు. ఇదిలా ఉండగా ఐపిఎల్ కారణంగానే చివరి టెస్టును రద్దు చేశారని వస్తున్న వార్తలను బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. ‘బిసిసిఐ బాధ్యతాయుతమైన బోర్డు. మేం ఇతర బోర్డులను గౌరవిస్తాం. టీమ్ ఇండియా జూనియర్ ఫిజియో కరోనా బారిన పడడంతో ఆటగాళ్లంతా మ్యాచ్ ఆడడానికి భయపడ్డారు. అందుకే మ్యాచ్‌ను రద్దు చేశాం’ అని గంగూలి స్పష్టత ఇచ్చాడు.
Kohli should give explanation on 5th test cancel: david gower