ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. అయితే తన సొంతగడ్డ బెంగళూరులో.. అదే జట్టుపై విజయం సాధించడంతో కెఎల్ రాహుల్ రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకున్నాడు. ‘ఇది నా గడ్డ’ అన్నట్టు బ్యాట్‌ని రౌండ్‌గా తిప్పాడు. ఈ సెలబ్రేషన్స్ వైరల్‌గా మారాయి.
అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో. అది కోహ్లీ అడ్డా. అక్కడ కోహ్లీ పేరిట ఒక స్టాండ్ ఉంది. దీంతో కోహ్లీ ఈరోజు ఢిల్లీపై.. ప్రత్యేకంగా కెఎల్ రాహుల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడని మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ అంచనా వేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్‌సిబి ఈసారి దూకుడుగా ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తప్పకుండా ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకుంటాడని నా అంచనా. కెఎల్ రాహుల్‌కి కౌంటర్ కూడా ఇస్తాడని అనిపిస్తోంది. మీరు కూర్చున్న స్టాండ్ నాది.. ఇక్కడ నేను బాస్’ అని కోహ్లీ నిరూపించుకుంటాడు అని అన్నారు.