హైదరాబాద్ : కోకాపేట్‌లోని నియోపోలీస్ లే ఔట్‌లోని ప్లాట్లను విక్రయించడానికి హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా మరోమారు భారీ ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోకాపేట ప్రాంతంలో అత్యంత ఎక్కువ విలువ కలిగిన భారీ విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండిఏ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏడు ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.2500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని హెచ్‌ఎండిఏ అంచనా వేస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో మూడెకరాలు మొదలుకొని తొమ్మిది ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న ఏడు పెద్ద ప్లాటన్లు హెచ్‌ఎండిఏ విక్రయించనుంది. ఈ ప్లాట్ల మొత్తం విస్తీర్ణం 45.33 ఎకరాలు కాగా ఎకరానికి కనీస ధరను రూ35 కోట్లుగా హెచ్‌ఎండిఏ పేర్కొంది. వేలంలో పాల్గొనే సంస్థలు, వ్యక్తులు హెచ్‌ఎండిఏ నిర్ణయించిన ధర కన్నా ఎక్కువగా కనీసం రూ.25 లక్షల చొప్పున పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలోని భూములు గతంలో భారీగా ధర పలకడంతో హెచ్‌ఎండిఏ భారీ ఎత్తున ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.
రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఈ నెలాఖరు వరకు గడువు
హెచ్‌ఎండిఏ ఆశించిన ధరకు ఈ ప్లాట్లు అమ్ముడుపోయినా దాదాపు రూ.1,600 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయి. డిమాండ్ ఉన్న ప్రాంతం, పెద్ద ప్లాట్లు కావడంతో వేలంలో ఎక్కువ ధర పలుకుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్లాట్లకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుండగా, రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది. ఆగస్టు మూడో తేదీన ‘ఈ- వేలం’ ద్వారా ఈ ప్లాట్లను హెచ్‌ఎండిఏ విక్రయించనుంది. గతంలోనే హైదరాబాద్ శివారుతో పాటు జిల్లాల్లో ఉన్న ప్లాట్లను కూడా ప్రభుత్వం విక్రయించింది. కొన్ని చోట్ల మంచి స్పందన రాగా.. మరికొన్ని చోట్ల మిశ్రమ స్పందన వచ్చింది.
2021లో రూ.2 వేల కోట్ల ఆదాయం
2021 సంవత్సరంలో నియోపోలీస్ లే ఔట్‌లోని 50 ఎకరాల విస్తీర్ణంలోని 8 ప్లాట్లను హెచ్‌ఎండిఏ వేలం వేయగా సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. వీటిని కొనుగోలు చేయడానికి బిడ్డర్లు భారీగా పోటీపడ్డారు. అప్పట్లో ఎకరం కనీస ధరను హెచ్‌ఎండిఏ రూ.25 కోట్లుగా నిర్ణయించగా బిడ్డర్లు పోటీపడి ఎకరానికి రూ.60.2కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో వచ్చిన స్పందన నేపథ్యంలో హెచ్‌ఎండిఏ ఈ లే ఔట్‌ను ప్యూచరిస్టిక్, అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 36 మీటర్లు, 45 మీటర్ల వెడల్పుతో ఎనిమిది లేన్ల క్యారేజ్‌వే అంతర్గత రోడ్లను నిర్మిస్తోంది. దీంతోపాటు ఈ లే ఔట్‌కు ఓఆర్‌ఆర్ అనుసంధానం అయ్యేలా అంతర్గత రోడ్లను నిర్మిస్తుండడంతో దీనికి భారీ క్రేజ్ ఏర్పడింది.
మోకిల, షాబాద్‌లలో సైతం ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్
ఇప్పటి వరకు భూములు అమ్మకం, కొనుగోలుదారులు విడతల వారీగా చేసిన చెల్లింపుల ద్వారా రూ.600 కోట్ల వరకు సమకూరినట్లు సమాచారం. మోకిల, షాబాద్‌లో వంద ప్లాట్ల విక్రయానికి కూడా ఇటీవల హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసింది. మోకిలలో 325 నుంచి 433 గజాల విస్తీర్ణం వరకు 50 ప్లాట్లు ఉండగా షాబాద్‌లో 300 గజాల విస్తీర్ణంతో 500 ప్లాట్లు ఉన్నాయి. మోకిల ప్రాంతంలో డిమాండ్ ఉన్న దృష్ట్యా అక్కడ కూడా మంచి ధర వస్తుందని, ఆదాయం బాగానే సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.