Monday, December 23, 2024

తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: కోలేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతూ, నిధుల కేటాయింపులో మోకాలొడ్డుతున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్ధ ఛైర్మన్ కోలేటి దామోదర్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ 10,461 కోట్లు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ విషయంలో క్షకపూరితంగా వ్యవహరించిందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. 2014-15 ఆర్ధిక ఏడాది రెవెన్యూలోటు భర్తీ కింద ఆంధ్రప్రదేశ్ కు నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం విభజన చట్టంలోని 94 సెక్షన్ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇందుకు గాను గత మూడు సంవత్సరాలకు సంబంధించి తెలంగాణకు రూ.1350 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఒక్క నయా పైసా కూడా విడుదల చేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో పదేండ్ల పాటు సుస్ధిర అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసు కోవాలని పునర్వ్యవస్ధీకరణ చట్టం నిర్ధేశిస్తున్నప్పటికీ కేంద్రం బేఖాతరు చేస్తోందని దామోదర్ ఎద్దేవా చేశారు. ఆర్ధికపరమైన అంశాలను పరిష్కరించకుండా కేంద్రప్రభుత్వం నిష్క్రియా పరత్వాన్ని ప్రదర్శిసున్నదని ఆయన ఆక్షేపించారు. సాక్షాత్తు పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టంలోని అనేక అంశాలను కేంద్రం అమలుచేయకపోవడం అప్రజాస్వామికమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ధిక సంఘం సిఫార్సులను అమలుచేసే సత్సంప్రదాయానికి కేంద్రం తిలోదకాలిచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై కక్షనూ, వివక్షనూ ప్రదర్శిస్తూ, అనేక ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నా సంక్షేమం అభివృద్ధిలో ఏనాడూ నిధుల కొరత రానివ్వకుండా సిఎం కెసిఆర్ ప్రజా ప్రయోజనాలను కాపాడడం కొందరికి కడుపు మంటగా మారిందని తెలియజేశారు.

అనేక సవాళ్ళు, అవరోధాల నడుమ సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రస్ధానం స్పూర్తిదాయకంగా కొనసాగుతున్నదన్నారు. కేంద్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధుల మంజూరులో వివక్షత చూపినగాని అభివృద్ధిలో దేశం ముందు అపూర్వమైన ఆదర్శాన్ని నిలబెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని కొనియాడారు. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన తెలంగాణ, కెసిఆర్ ఆవిష్కరించిన ఎన్నో పథకాలకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించడాన్ని జీర్ణించుకోలేని కేంద్రం పెద్దలు నిధులు మంజూరులో వివక్షత చూపుతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అందుకే దేశం యావత్ తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణరాష్ట్రంపై చిన్నచూపుచూస్తున్న కేంద్రం పెద్దలకు కర్ణాటక తరహా చేదు ఫలితాలే త్వరలో ఇక్కడ పునరావృతమవుతాయని జ్యోసం చెప్పారు. తెలంగాణపై వివక్షత విడనాడి విభజన చట్టం ప్రకారం విడుదల చేయాల్సిన నిధులను తక్షణం మంజూరు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News