Tuesday, November 5, 2024

ఢిల్లీ జైత్ర యాత్రకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

Kolkata beat Delhi by three wickets

నరైన్ ఆల్‌రౌండ్ షో, రాణించిన రాణా, రిషబ్ సేనపై కోల్‌కతా గెలుపు

షార్జా: ఐపిఎల్ సీజన్14లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న ఢిల్లీకి నైట్‌రైడర్స్ షాక్ ఇచ్చింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన పోరులో కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. తర్వాత లక్షఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా కోల్‌కతా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఆరంభంలోనే..

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. కిందటి మ్యాచ్‌లో కూడా అయ్యర్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన అయ్యర్ ఢిల్లీపై మాత్రం ఆ జోరును కనబరచలేక పోయాడు. రెండు ఫోర్లతో 14 పరుగులు మాత్రమే చేసి లలిత్ యాదవ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికీ కోల్‌కతా స్కోరు 28 పరుగులు మాత్రమే. వన్‌డౌన్‌లో వచ్చిన విధ్వంసక ఆటగాడు రాహుల్ త్రిపాఠి కూడా విఫలమయ్యాడు. ఐదు బంతుల్లో ఒక సిక్స్‌తో 9 పరుగులు మాత్రమే చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా వెనుదిరిగాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 30 పరుగులు చేసి గిల్‌ను రబడా వెనక్కి పంపాడు. ఆ వెంటనే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఔటయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో మోర్గాన్ పెవిలియన్ చేరాడు. అతను ఖాతా కూడా తెరవలేదు. దీంతో కోల్‌కతా 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న రాణా, నరైన్

ఒకవైపు వికెట్లు పడుతున్నా నితీశ్ రాణా తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ కూడా నిరాశ పరిచాడు. 12 పరుగులు మాత్రమే చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన నరైన్ దూకుడుగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. రాణా కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నరైన్ 10 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన టిమ్ సౌథి (3) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. అయితే ఆఖరు వరకు నాటౌట్‌గా నిలిచిన రాణా కోల్‌కతాకు విజయం సాధించి పెట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాణా 27 బంతుల్లో రెండు సిక్సర్లు, మరో 2 ఫోర్లతో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

శుభారంభం లభించినా..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్ మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో స్మిత్ ఓపెనర్‌గా వచ్చాడు. ధావన్‌తో కలిసి అతను స్కోరును ముందుకు నడిపించాడు. ఇటు ధావన్, అటు స్మిత్ మెరుగ్గా ఆడడంతో ఢిల్లీకి మంచి ఆరంభమే లభించింది. ధాటిగా ఆడిన ధావన్ ఐదు ఫోర్లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ జట్టుకు అండగా నిలువలేక పోయాడు. ఒక పరుగు మాత్రమే చేసి రనౌటయ్యాడు. ఆ తర్వాత కోల్‌కతా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు పడగొట్టారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ 4 ఫోర్లతో 39 పరుగులు చేసి ఫెర్గూసన్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన హెట్‌మెయిర్ (4), అక్షర్ పటేల్ (0), లలిత్ యాదవ్ (0), అశ్విన్ (9) విఫలమయ్యారు. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ రిషబ్ పంత్ మూడు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్, వెంకటేశ్, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా ఢిల్లీ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. కోల్‌కతా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఆల్‌రౌండ్‌షోతో అలరించిన సునిల్ నరైన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

ప్లేఆఫ్ ఆశలు సజీవం

రెండో దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం కోల్‌కతా 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై, ఢిల్లీ చెరో 8 విజయాలతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆరు విజయాలతో బెంగళూరు మూడో స్థానాన్ని దక్కించుకుంది. కోల్‌కతా మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో గెలిస్తే కోల్‌కతాకు ప్లేఆఫ్ బెర్త్ ఖాయమవుతోంది. నైట్‌రైడర్స్ యుఎఇలో మెరుగైన ప్రదర్శనతో దూసుకు పోతోంది. మూడు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ముంబై, పంజాబ్, రాజస్థాన్ వరుస ఓటములతో సతమతమవుతుండగా మోర్గాన్ సేన మాత్రం వరుస విజయాలతో నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసుకు దూరమైంది. ప్రస్తుతం బెంగళూరు, కోల్‌కతా, పంజాబ్, ముంబై, రాజస్థాన్‌ల మధ్య ప్లేఆఫ్ కోసం గట్టి పోటీ నెలకొంది. చెన్నై, ఢిల్లీలకు ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌లు దాదాపు ఖరారయ్యాయనే చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News