పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తమకు నష్టపరిహారం ఇస్తామంటూ ఆమె ప్రతిపాదించారని కోల్‌కతాలోని ఆర్‌జి కార్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ తల్లి ఆరోపించారు. అంతకు ముందు మమతా బెనర్జీ మాట్లాడుతూ..హత్యాచారానికి గురైన ట్రెయినీ డాక్టర్ కుటుంబానికి తాను డబ్బు ఇవ్వచూపానంటూ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. మమత వ్యాఖ్యలపై బాధితురాలి తల్లి స్పందిస్తూ ముఖ్యమంత్రి అబద్ధమాడుతున్నారని అన్నారు. మీకు నష్టపరిహారం వస్తుంది..ఆ డబ్బుతో మీ కుమార్తెకు స్మారకార్థం ఏదైనా నిర్మించవచ్చు అని మమత మాతో అన్నారని ఆమె తెలిపారు. నా కుమార్తెకు న్యాయం జరిగిన నాడు నేనే మీ కార్యాలయానికి వచ్చి నష్టపరిహారం తీసుకుంటానని తాను ముఖ్యమంత్రికి చెప్పానని బాధితురాలి తల్లి స్పష్టం చేశారు.
తన కుమార్తె హత్యకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలను అణచివేయడానికి మమత ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. రానున్న దుర్గ పూజల కోసం తమ నిరసనలను నిలిపివేయాలంటూ జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ పిలుపునివ్వడాన్ని అమానవీయంగా బాధితురాలి తల్లి అభివర్ణించారు. తాను ఒక బాలికకు తల్లినని, తాను తన కుమార్తెను కోల్పోయానని, అందుకే మమత మాటలు తనకు అమానవీయంగా కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. దుర్గ పూజల కోసం దేశమంతా సిద్ధపడుతుంటే అది వారి ఇష్టమని ఆమె అన్నారు. మా ఇంట్లో కూడా దుర్గ పూజ జరుపుకునేవాళ్లం. నా కుమార్తె ఇంట్లో పూజ చేసేది. ఇప్పుడు మా జీవితాలలో చీకటి నిండిపోయింది. ఈ సమయంలో పండుగ చేసుకోండని నేను ఇతరులకు ఎలా చెప్పగలను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఇలాంటి ఘటనే జరిగి ఉంటే మమతా బెనర్జీ అలా అని ఉండేవారా అంటూ ఆమె నిలదీశారు.