ఐపిఎల్ సీజన్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 80 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. కోల్‌కతాకు ఇది రెండో విజయం కాగా, సన్‌రైజర్స్ హ్యాట్రిక్ పరాజయాన్ని దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు డికాక్ (1), సునీల్ నరైన్ (7) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ అజింక్య రహానె, అంగ్‌కృష్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. దూకుడుగా ఆడిన రహానె 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 38 పరుగులు చేసి ఔటయ్యాడు.
రఘువంశీ 32 బంతుల్లోనే 2 సిక్స్‌లు, ఐదు బౌండరీలతో 50 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ (2) మరోసారి నిరాశ పరిచారు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలమయ్యాడు. మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33), నితీశ్‌కుమార్ రెడ్డి (19) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు పడగట్టారు.