Monday, January 20, 2025

కోల్‌కతా డాక్టర్ ‘అప్పటికే విగతజీవి’

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం కేసులో అరెస్టయిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ తాను ఆమెను చూసేటప్పటికే విగతజీవి అని, తాను భయంతో అక్కడి నుంచి పారిపోయానని ఆదివారం నిజనిర్ధారణ పరీక్షలో చెప్పినట్లు తెలుస్తోంది. సంజయ్ రాయ్ పలు ‘ఎలిబీలు’ పేర్కొన్నట్లు సిబిఐ వర్గాలు ఒక ఆంగ్ల వార్తాపత్రికతో చెప్పారు. తాము ప్రశ్నిస్తున్న సమయంలో సంజయ్ రాయ్‌లో ‘విసుగు కనిపించలేదు, కాని ఆత్రంగా ఉన్నాడు’ అని సిబిఐ వర్గాలు తెలిపాయి. అయితే, సంజయ్ రాయ్‌పై నిర్వహించిన నిజ నిర్ధారణ పరీక్షలో పలు ‘తప్పుడు, అవిశ్వసనీయ సమాధానాలు’ ఇచ్చాడని తెలుస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక మహిళా డాక్టర్‌పై హత్యాచారం సందర్భంగా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సిబిఐ అధికారులు పోలిగ్రాఫ్ లేదా నిజ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు.

రాయ్ ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలులో ఈ పరీక్ష నిర్వహించారని అధికారి ఒకరు తెలియజేశారు. తాను పోలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధమని నిందితుడు సంజయ్ రాయ్ ఒక ప్రత్యేక కోర్టుకు తెలియజేసినట్లు అతని న్యాయవాది ఇంతకుముందు ఒక వార్తాచానెల్‌తో చెప్పారు. ఎందుకు సిద్ధమని న్యాయమూర్తి అడిగినప్పుడు తాను ‘అమాయకుడిని’ అని, ‘ఇరికించారు ’ అని రాయ్ చెప్పినట్లు న్యాయవాది తెలిపారు. ‘పోలిగ్రాఫ్ పరీక్ష ద్వారా నిజం వెలుగులోకి రావాలని నేను కూడా కోరుకుంటున్నా’ అని రాయ్‌ని ఉటంకిస్తూ న్యాయవాది చెప్పినట్లు ఆ వార్తా చానెల్ ఈ నెల 24న తెలియజేసింది. వైద్య కళాశాల సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించిన రోజు ఈ నెల 10న 33 ఏళ్ల రాయ్‌ని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. పిటిఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, ట్రైనీ డాక్టర్ మృతదేహం సమీపంలో కనిపించిన ఒక బ్లూటూత్ పరికరం రాయ్ అరెస్టుకు దారి తీసింది. సెమినార్ హాల్ ఉన్న ఆసుపత్రి మూడవ అంతస్తులో అతను ఉన్నట్లు సిసిటివి ఫుటేజ్‌లో కూడా కనిపించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తమ కోల్‌కతా కార్యాలయంలో మరి ఇద్దరిపై కూడా పోలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారని అధికారి ఒకరు తెలిపారు. కాగా, రాయ్‌పై పోలిగ్రాఫ్ పరీక్ష సుమారు నాలుగు గంటల తరువాత ముగిసిందని ఆయన తెలియజేశారు. ఆర్‌జికెఎంసిహెచ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా నలుగురు వ్యక్తులకు శనివారం ఆ పరీక్ష నిర్వహించారు. అయితే, కోర్టులో విచారణ సమయంలో ఆ పరీక్షను సాక్షాధారంగా ఉపయోగించజాలరు. కానీ, పరీక్ష ఫలితాలు మరింత దర్యాప్తు కోసం సంస్థకు ఒక మార్గం చూపుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News