Sunday, December 22, 2024

ఆస్పత్రులలో అకృత్యాలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలోని ఓ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే సమయంలో ఈ సంఘటన ఆస్పత్రులు, వైద్యకళాశాలల్లో సిబ్బంది ఎంత అభద్రతాభావ పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారో కళ్లకు కడుతోంది. రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న యువ మహిళా డాక్టర్ పై ఓ సివిక్ అటెండెంట్ పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులకు చెందిన వైద్యులు, సిబ్బంది నిరసనలకు దిగడంతో ఎక్కడికక్కడ వైద్య సేవలకు విఘాతం ఏర్పడుతోంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్కతాటిపైకి వచ్చి విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శనలకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమని చెప్పుకోవచ్చు.

విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన తీరు, నిందితుడి ఉన్మాద వైఖరి దృష్ట్యా ఈ ఉదంతం దేశమంతటినీ కదిలించి, కంటనీరు పెట్టించింది. ఉధృత స్థాయిలో నిరసనలు పెల్లుబకడానికి ఇదే కారణం. నిందితుడిని కఠినంగా శిక్షించడంతోపాటు ఆస్పత్రులలో పని చేసే సిబ్బందికి రక్షణ కల్పించేలా పటుతరమైన చట్టాలకు రూపకల్పన చేయాలని, కేసును సిబిఐకి అప్పగించాలని డాక్టర్లు కోరుతున్నారు. ఈ ఉదంతం యాభై ఏళ్ళ క్రితం ముంబయిలోని కెఇఎం ఆస్పత్రిలో జరిగిన ఓ అత్యాచార సంఘటనను తలపిస్తోంది. అరుణా షాన్‌బాగ్ అనే నర్సుపై అదే ఆస్పత్రిలో పని చేసే వార్డుబాయ్ అత్యాచారం చేసి, చంపబోయాడు. ఆమె కోమాలోకి వెళ్లిపోయి, 42 ఏళ్లపాటు అదే స్థితిలో ఉండి కన్నుమూసింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడలేదనడానికి కోల్‌కతా ఉదంతమే తాజా నిదర్శనం.

ఆస్పత్రులపైనా, వాటిలో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బందిపైనా దాడులు జరగడం ఇటీవలికాలంలో పరిపాటిగా మారింది. ఆస్పత్రిలో రోగి మరణిస్తే అందుకు కారణం డాక్టర్లేనంటూ వారిపైనా, ఆస్పత్రిపైనా రోగి తాలూకు బంధువులు దాడులకు పాల్పడుతున్నారు. నాసిరకం వైద్య సేవలు అందించడం, ఎమర్జెన్సీ కేసుల విషయంలోనూ వైద్యులు, సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం వంటివి కూడా రోగులు, వారి బంధువుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. సాధారణంగా ఆస్పత్రులలో నర్సులపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటివి ఎక్కువగా చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇటు వైద్యులకు, అటు రోగులకు మధ్య అనుసంధానకర్తలుగా ఉంటూ, రోగిని అనుక్షణం కనిపెట్టుకుని ఉండే నర్సులపై రోగులు, వారి బంధువులు అకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళారోగులపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారాలకు పాల్పడటం కూడా కద్దు.

గత నెలలో గురుగ్రామ్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన విదేశీ మహిళపై అదే ఆస్పత్రిలో పనిచేసే అటెండెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మధ్య హజారీబాగ్‌లో చికిత్స కోసం చేరిన ఓ జీవిత ఖైదీ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డును చంపి పరారయ్యాడు. ఇక బీహార్ లోని చంపారన్ జిల్లాలో ఓ నర్సుపై డాక్టర్, ఇతర సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆస్పత్రులలో జరుగుతున్న ఘోరాలకు ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నిరుడు అక్టోబర్‌లో ఢిల్లీలో డాక్టర్లు, వైద్య సిబ్బంది రోడ్డెక్కి ‘చలో రాజ్ ఘాట్’ పేరిట ర్యాలీ నిర్వహించారు కూడా. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అనేక రాష్ట్రాలు కఠినతరమైన నిబంధనలను రూపొందించాయి.

కొన్ని రాష్ట్రాలలో వీటిని నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తున్నారు. అయితే వీటివల్ల అంతగా ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వమే పటుతరమైన చట్టానికి రూపకల్పన చేయాలంటూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చేసిన విజ్ఞప్తి సబబైనదే. చట్టాల రూపకల్పన జరిగినప్పటికీ, పని ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు కల్పించవలసిన బాధ్యత నుంచి ఆస్పత్రులు, వైద్య కళాశాలల యాజమాన్యాలు తప్పించుకోలేవు. మహిళా సిబ్బంది పని చేసే చోట, మహిళా వార్డులపైనా నిరంతర నిఘా ఉంచడం అవసరం. ప్రైవేటు ఆస్పత్రులతో పోలిస్తే, భద్రతా ఏర్పాట్లు అంతంతమాత్రంగా ఉండే ప్రభుత్వాసుపత్రుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కోల్‌కతా ఉదంతం నేపథ్యంలో ఇలాంటి సంఘటన ఇకపై మరొకటి చోటు చేసుకోకుండా కేంద్రప్రభుత్వం పటుతరమైన చట్టానికి రూపకల్పన జరిపి, అమలులోకి తేవాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News