pv1 saturday
బెంగాల్ హత్యాచార ఘటనలో కథనాల గందరగోళం
తోసిపుచ్చిన కోల్‌కతా పోలీస్‌లు
కోల్‌కతా : కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటివరకు ఎన్నో సంచలన విషయాలు బయటపడినప్పటికీ, అవేవీ నిజం కాదని కోల్‌కతా పోలీస్‌లు తోసిపుచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుటే జరిగిన వైద్యురాలి పోస్ట్‌మార్టం ప్రక్రియ మొత్తం వీడియోగా తీశారు. అందులో ఎక్కడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్టు ప్రస్తావించలేదు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్ట్‌మార్టంలో గుర్తించారని వార్తలు వచ్చాయి.
ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషనే ఈ విధమైన పలు కథనాలకు దారి తీసిందని, కోల్‌కతా పోలీస్ చీఫ్ వినేశ్ గోయల్ పేర్కొన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే ఈ ప్రయత్నాలని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని కోల్‌కతా హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఆస్పత్రి యంత్రాంగం కేసు నమోదు చేయక పోవడాన్ని ప్రశ్నించింది. మృతి ఘటనలో ఎటువంటి ఫిర్యాదు అందనప్పుడు పోలీస్‌లు దాన్ని మొదట అసహజ మరణంగానే నమోదు చేస్తారని గోయల్ పేర్కొన్నారు.
ఎవరైనా ఫిర్యాదు చేసినా, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా అదిహత్యా, లేక ఆత్మహత్యా అనేది ప్రస్తావిస్తారని తెలిపారు. అసహజ మరణంగా నమోదు చేయడం ద్వారా విషయాన్ని దాచిపెట్టి , ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటున్నామని ఆరోపించడంపై గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న కొన్ని పోస్ట్‌లు సహచర వైద్యుల్ని అనుమానితులుగా పేర్కొన్నాయి. ఆమె తల్లిదండ్రులు కొన్ని పేర్ల జాబితాను సీబీఐకి ఇచ్చినట్టు పేర్కొన్నాయి. ఒక్క వాలంటీర్ పేరు మినహా ఇప్పటివరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయలేదు. ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలను గోయల్ తోసిపుచ్చారు.
ఇక ఆ జూనియర్ డాక్టర్ పేరుతో ఉన్న ధ్రువీకరించని ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ వైరల్ అయింది. ఈ లీక్ అత్యాచార కేసుల్లో బాధితురాలికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించ కూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో పోలీస్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కోల్‌కతా హైకోర్టు, సిబిఐకి బదిలీ చేసింది. మరోవైపు ఆదివారం కల్లా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పోలీసులు, సీబిఐకి అల్టిమేటం ఇచ్చారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
వైద్యుల బదిలీలను ప్రశ్నించిన బీజేపీ
వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో ఆసుపత్రికి చెందిన 42 మంది డాక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. “ ఆగస్టు 16న పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వశాఖ 8 పేజీల సుదీర్ఘ బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇప్పటివరకు ఈ రెండు సంస్థల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లను సిలిగుడి, తమ్‌లుక్, ఝర్‌గ్రామ్ కళాశాలలకు బదిలీ చేశారని, దీని ద్వారా సీనియర్ వైద్యుల సంఘాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ నిరసనల్లో పాల్గొంటున్న ప్రజలకు , జర్నలిస్ట్‌లకు నోటీస్‌లు పంపుతోందని, క్రైమ్‌సీన్‌ను నాశనం చేయడానికి 5000 మంది గూండాలను పంపిందని, 43 మంది వైద్యులను బదిలీ చేసిందని, ఇది డాక్టర్లపై ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత , బెదిరింపు చర్య” అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం అంటూ తిరిగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.