ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టివికె) పార్టీ సిద్ధాంతాలను తమ పార్టీకి నకలుగా అధికార ద్రవిడ మున్నేట్ర కళగం(డిఎంకె) అభివర్ణించగా టివికె సిద్ధాంతాలు వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న సిద్ధాంతాల కలబోతగా ప్రధాన ప్రతిపక్షం అన్నాడిఎంకె వ్యాఖ్యానించింది. కాగా విజయ్ నాయకత్వంలోని పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టికె) స్పష్టం చేసింది. పార్టీని స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి ఆదివారం బహిరంగ సభలో ప్రసంగించిన విజయ్ ప్రధానంగా అధికార డిఎంకెని, ఆ పార్టీ నాయకత్వాన్నే లక్షంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. విజయ్ ప్రసంగంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు సోమవారం స్పందించారు. తన పార్టీ సిద్ధాంతాలను, గవర్నర్ కార్యాలయం పట్ల తన వ్యతిరేకతను తెలియచేస్తూ విజయ్ చేసిన ప్రసంగం గురించి డిఎంకె నాయకుడు టికెఎస్ ఎళంగోవన్ స్పందిస్తూ అవన్నీ తమ సిద్ధాంతాలేనని చెప్పారు.
విజయ్ తమ పార్టీ సిద్ధాంతాలనే కాపీ కొట్టారని, ఆయన చెప్పినవన్నీ తాము ఇప్పటికే పాటిస్తున్నామని, అవి తమ సిద్ధాంతాలేనని ఎలంగోవన్ చెప్పారు. ఇది ఇంకా తొలి సమావేశమేనని, వేచి చూద్దామని ఆయన చెప్పారు. ఇలాంటి పార్టీలను గతంలో చాలా చూశామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ చాలా బలమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నదని, గడచిన 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొందని ఎళంగోవన్ చెప్పారు. ప్రజల సమస్యల కోసం పోరాడుతూ డిఎంకె నాయకులు జైళ్లకు కూడా వెళ్లారని, ఎన్నో ఎన్నికలలో ఓటమి చెందినప్పటికీ బలంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాల పునాదిపై డిఎంకె నిర్మాణం చెందగా అధికారం కోసమే విజయ్ పార్టీ పుట్టిందని ఆయన విమర్శించారు. డిఎంకె నాయకుల మాదిరిగా ప్రజల కోసం జైళ్లకు వెళ్లే పరిస్థితి టివికె నాయకులకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా..విజయ్ రాజకీయ ప్రవేశంపై అన్నాడిఎంకె అధికార ప్రతినిధి కోవై సత్యన్ స్పందిస్తూ టివికె సిద్ధాంతాలు కొత్త సీసాలో పాతసారాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
విజయ్ చాలా అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారని, వాటిని ఎలా కార్యరూపంలో పెడతారో వేచి చూస్తామని ఆయన చెప్పారు. బిజెపి నాయకుడు హెచ్ రాజా స్పందిస్తూ టివికె పార్టీ పూర్తిగా ప్రాంతీయ పార్టీ అని, కాని బిజెపి జాతీయవాద పార్టీ అని చెప్పారు. టివికె వల్ల తమ ఓటుబ్యాంకు చెక్కుచెదరదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ పార్టీ ద్రవిడ పార్టీల ఓట్లను చీలుస్తుందని, దీని వల్ల డిఎంకె నష్టపోయే అవకాశం ఎక్కువని ఆయన అంచనా వేశారు. లివికె ఆవిర్భావంపై విజయ్‌ను అభివనందించిన బిజెపి నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియచేశారు. డిఎంకె నాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు పోఈగా టివికె ఏర్పాడినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. కాగా..నామ్ తమిళర్ కట్చి నాయకుడు, తమిళ జాతీయవాది సీమాన్ స్పందిస్తూ..ఇవిఆర్, పెరియార్‌ను సమర్థిస్తున్నానని చెప్పిన విజయ్ ద్రవిడ సిద్ధాంతాలను కూడా ఆమోదించినట్లేనని అన్నారు.
తాము ద్రవిడియన్ మోడల్ తీసుకువస్తామని విజయ్ చెప్పడంలో అర్థమేమిటని, ఇప్పటికే ఇదే మోడల్‌ను అధికార డిఎంకె పాటిస్తోందని సీమాన్ వ్యాఖ్యానించారు. పొత్తులను తాము ఆహ్వానిస్తున్నట్లు విజయ్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ తమకు స్పష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయని, తాము ఇతరులతో చేతులు కలిపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.పెరియార్ హేతవాదాన్ని ఆమోదిస్తామే తప్ప ఆయన నాస్తికవాదాన్ని కాదని విజయ్ చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. నాస్తికవాదం కూడా హేతువాదంలో భాగమేనని ఆయన వివరించారు.