Tuesday, September 17, 2024

రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుంది

- Advertisement -
- Advertisement -

నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 వేల కోట్లు కేటాయించాం
స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
క్రెడాయ్ తెలంగాణ సదస్సులో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు పేర్కొన్నారు. స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, తెలంగాణ అభివృద్ధి, బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ సదస్సు 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హాజరై మాట్లాడారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో జరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 వేల కోట్లు కేటాయించిం దని ఆయన వెల్లడించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, 162 కిలోమీటర్ల పొడవైన నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు, పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్ మెట్రో రైలు, తాగునీటి సరఫరా వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పునాది వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన కొనియాడారు. కృష్ణా, గోదావరి నదుల ఉభయ నదుల నీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదే నన్నారు.

తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్‌కు ముచ్చర్ల వద్ద ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, మెట్రో రైల్ విస్తరణ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. ఈ తరహా ప్రాజెక్టులు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని, ఇవి గణనీయమైన అభివృద్ధిని సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుల కృషితో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ, సాఫ్ట్‌వేర్, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు.

తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్‌రోడ్డును తీసుకురావడంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని, ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రెడాయ్ సభ్యులు పాల్గొనడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రెడాయ్ సభ్యులకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మీ వ్యాపారం, భవన నిర్మాణ కార్యకలాపాలలో, తమ ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. తెలంగాణలో పట్టణీకరణ వేగవంతంగా రూపాంతరం చెందుతుందని ఇప్పటికే సుమారు 45 శాతం పట్టణ ప్రాంతాలుగా మారాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాల పాత్ర అని ఆయన ప్రశంసించారు.

సమస్యలను మా దృష్టికి తీసుకురావచ్చు: మంత్రి కోమటిరెడ్డి
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో యువరాజు ప్రభుత్వం మాత్రమే ఉండేదని, మీకు పనులు కావాలంటే ఆ ప్రభుత్వంలో కేవలం ఇద్దరిని మాత్రమే కలిస్తే సరిపోయేదన్నారు. అందులో ఒకరు ఫాంహౌస్‌లో ఉంటే ఇంకొకరు విదేశాల్లో సెల్ఫీలు దిగడం, ఫొటోలకు పోజులు ఇవ్వడం సరిపోయేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు అలా కాదని ఎవరైనా ఎప్పుడైనా మీ సమస్యలు తమ దృష్టికి తీసుకురావొచ్చని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. క్రెడాయ్ సమస్యలు నేరుగా తమకు చెప్పొచ్చన్నారు. గత సర్కారు ఆరు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిందని వేల కోట్ల కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదన్నారు. తెలంగాణలో నిర్మాణ రంగం రోజు రోజుకు పెరుగుతోందన్నారు.

ఒక్క హైదరాబాద్ కాకుండా ఇది జిల్లాలకు వ్యాప్తి చెందిందన్నారు. ఈరోజు ఓఆర్‌ఆర్‌కు ఇంత పేరు వచ్చిందంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముందు చూపే కారణమన్నారు. గతంలో చంద్రబాబు డెవలప్‌మెంట్ ను హైటెక్ సిటీకే పరిమితం చేశారని, దీనిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారన్నారు. ఓఆర్‌ఆర్ కంటే అద్భుతంగా ఆర్‌ఆర్‌ఆర్ టెండర్లు పిలవబోతున్నామని కోమటిరెడ్డి అన్నారు. సిటీ ఒకే వైపు కాకుండా సౌత్ సైడ్ కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరో మైలురాయి వంటిదన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామన్నారు.

మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది: ఎమ్మెల్యే కుంభం
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. అత్యధికంగా బిల్డర్స్ , కార్మికులు, ఉన్న అసోసియేషన్ క్రెడాయ్ అని అనిల్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తలమానికంగా ఓఆర్‌ఆర్ ఉందన్నారు. త్వరలో మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరుగుతుందన్నారు. మూసీ అండ్ ఈసా నదులపై బఫర్ సమస్యలు ఉన్నాయన్నారు. హైడ్రా నేపథ్యంలో అనుమతులకు సంబంధించి ముందు జాగ్రత్త వహించాలన్నారు.

టెక్నాలజీతో ముందుకు సాగాలి: ప్రేమ్‌సాయిరెడ్డి
క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాయిరెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలోని నిపుణులు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇస్తున్నారని వాటిని బిల్డర్లు అనుసరించాలని ఆయన సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకొని బిల్డర్లు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం భూముల విలువలను పెంచేందుకు నిర్ణయం తీసుకుందని, అదే విధంగా రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ మురళీ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పాండు రంగారెడ్డి, ఐజీబిసి జాతీయ వైస్ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి, క్రెడాయ్ సభ్యులు, బిల్డర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News