త్రిబుల్ ఆర్‌పై మంత్రి కోమటిరెడ్డికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ
రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్, మచిలీపట్నం జాతీయ
రహదారి నిర్మాణానికి అభయం శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను
వేగవంతం చేయాలని గడ్కరీని కోరిన కోమటిరెడ్డి ఢిల్లీలోని పటౌడి
హౌస్‌లోనే తెలంగాణ భవన్ నిర్మిస్తామని ప్రకటన మరో కేంద్ర
మంత్రి రామ్మోహన్‌నాయుడుతో మంత్రి కోమటిరెడ్డి భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: రీజనల్ రిం గ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి తెలిపారు. దీనికి స్పందిస్తూ రెండు నెల ల్లో అన్ని అనుమతులు ఇస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పా రు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి 95శాతం భూసేకరణ పూర్తయ్యిందని ఆయ న తెలిపారు. కేబినెట్ అప్రూవల్ వచ్చాక పరిహారం ఇస్తామని గడ్కరీ తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు నితి న్ గడ్కరీ, రాంమ్మోహన్ నాయుడుతో మం గళవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపిలు భేటీ అయ్యా రు. రీజనల్ రింగ్‌రోడ్డు, జాతీయ రహదారు లు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు.
హైదరాబాద్ టు విజయవాడ ఆరు లైన్ల రహదారి
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్- టు విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరామన్నారు. రెండు ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణం జరిపేందుకు టెండర్లు పిలవాలని గడ్కరీ అధికారులను ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ఎలివెటెడ్ కారిడార్‌ను వేగవంతం చే యాలని కోరామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అటవీ భూములకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉన్నందున ప్రత్యేక సమావేశం పెట్టాలని అధికారులకు గడ్కరీ సూచించారని ఆయన పేర్కొన్నారు. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచేందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లడించారు.
పర్వతమాల ప్రా జెక్టు కింద 5 రోప్ వేలు అడిగినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాంమ్మోహన్ నాయుడుతో మామునూరు ఎయిర్ పోర్టు గురించి చర్చించామని, మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రితో తాను తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. జీఎంఆర్ నుంచి ఎన్‌ఓసి తీసుకున్నామని, మరికొన్ని అనుమతులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ఈ ఎయిర్ పోర్టును పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్తగూడెం, రామగుండం పెద్దపల్లి ఎయిర్‌పోర్టు, ఆదిలాబాద్, నిజామాబాద్ జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఫిజబిలిటి పరిశీలించాలని ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులను కేంద్రమంత్రి రాంమ్మోహన్‌నాయుడు ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
మామునూర్ ఎయిర్ పోర్టుకు సంబంధించి 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి వారం పదిరోజుల్లో టెండర్లు పిలుస్తామని, పటౌడి హౌస్‌లో అన్ని సదుపాయాలతో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తామని, డిజైన్లు సిఎం ముందుంచామని, అన్ని సదుపాయాలతో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మా ణం ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో కేంద్రమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు ఇలా
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (ఎన్‌హెచ్-765) పర్వత్ మాల పథకం కింద 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరు
సిఆర్‌ఐఎఫ్ సేతుబంధు పథకం కింద 12 ప్రాజెక్టుల మంజూరు
ఎన్‌హెచ్ 65లోని హైదరాబాద్- టు విజయవాడ విభాగం 6 లేనింగ్, ఎన్‌హెచ్ 163 లోని హైదరాబాద్ టు- మన్నెగూడ విభాగం 4 లేనింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేడం వంటి 5 ప్రధాన అంశాలతో కూడిన అభ్యర్ధలను నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందించారు.
చౌటుప్పల్ (ఎన్‌హెచ్65) – ఆమన్‌గల్, షాద్‌నగర్, సంగారెడ్డిల మీదుగా నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ ను ఫైనలైజ్ ప్రకటన చేస్తూ ఆమోదం తెలపాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి విన్నవించారు.
62 కిలోమీటర్ల ఎలివేటెడెట్ కారిడార్
హైదరాబాద్- టు శ్రీశైలం (ఎన్‌హెచ్-765) 187 కిలోమీటర్ల రహదారిలో 62 కిలోమీటర్ల ఎలివేటెడెట్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గడ్కరీని కోరారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో 62 కిలోమీటర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మీదుగా వెళుతుండటంతో అటవీ అనుమతుల కారణంగా అభివృద్ధి జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రగతిలో ఆలస్యం జరగకుండా వేగంగా అనుమతులు మం జూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.
5 రోప్ వే ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేయాలి
సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలవాలని, పర్వత్ మాల పథకం కింద 5 రోప్ వే ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రదేశాలకు రోప్‌వే కనెక్టివిటీ అభివృద్ధి కోసం పర్వతమాల పథకాన్ని ప్రవేశపెట్టిందని అయితే, ఈ పథకంలో తెలంగాణకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాజెక్టులు మంజూరు కాలేదని నితిన్ గడ్కరీ దృష్టికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకెళ్లారు.
పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు
పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాన్ని అందించేందుకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి (2 కి.మీ) రోప్‌వే, భువనగిరి కోటకు (1 కి.మీ) రోప్‌వే, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ (2 కి.మీ)ల రోప్‌వే, నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా (5 కి.మీ)లు నాగార్జునకొండను కలుపుతూ రోప్‌వే, మంథనిలోని రామగిరి కోట (2 కి.మీ) రోప్‌వే వంటి 5 రోప్ వే ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరీ చేయాలని కోరిన మంత్రి కోమటిరెడ్డి కోరారు.
సిఆర్‌ఐఎఫ్ -సేతుబంధన్ పథకం క్రింద 12 ప్రాజెక్టులు
సిఆర్‌ఐఎఫ్ సేతుబంధు పథకం క్రింద రూ. 887.45 కోట్ల విలువైన 12 రహదారి పనులను మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసిన లేఖ (26.06.2024) విషయాన్ని నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికి ఆ అభ్యర్ధనలు పెండింగ్ లో ఉండటంతో తాను మరో అభ్యర్ధన లేఖను నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి అందించారు.