మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యా పింగ్ కేసులో ఎప్పుడు జైలుకు వెళ్లేది తెలియదని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరో చెబితే వినే రక్తం మా నల్గొండోళ్లది కాదని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీ డియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల కోసం రెచ్చగొట్టగానే రెచ్చిపోవడానికి నల్లగొండ ప్రజలు అమాయకులు కాదని ఆయ న అన్నారు. నల్లగొండ ప్రజలది దొరలు చెబితే వినే రక్తం కాదని ఆయ న అన్నారు. మూసీ క ష్టాలంటే ఏమిటో న ల్లగొండ జిల్లా ప్రజలను అడిగితే చెబుతార ని మంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అధికారం పోయినా కూడా బిఆర్‌ఎస్ నేతల్లో ఇంకా అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆయన మండిపడ్డారు. కెటిఆర్, హరీష్ రావులకు నల్గొండ వాళ్లంటే ఎందుకు అంత కోపమని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. “విషం పెట్టి చంపండి, లేదంటే మేమే చచ్చి పోతాం” అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కెటిఆర్, హరీష్‌రావులు మూసీ ప్రజలను రెచ్చ గొడుతున్నారని, వాళ్ల ఇంటి వద్ద ఎక్కడపడితే అక్కడ శాంతియుత పద్ధతిలో నిరసన చెబుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
కేబుల్ బ్రిడ్జి తప్ప హైదరాబాద్‌కు బిఆర్‌ఎస్ చేసిందేమీ….
కేబుల్ బ్రిడ్జి తప్ప హైదరాబాద్‌కు బిఆర్‌ఎస్ చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. బిజెపి నేతలు కూడా మూసీ ప్రక్షాళనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధలు కిషన్ రెడ్డికి తెలియవా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. అసలు కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకోవడం దండగ అని, ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కూడా కాదని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన అనేది గొప్ప కార్యక్రమమని ఆయన అన్నారు. బాధితులను రోడ్డున పడనివ్వబోమని డబుల్ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. విపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
నేను, రేవంత్ ఇద్దరం కష్టపడి పైకొచ్చాం
రైతు కుటుంబంలో పుట్టిన తాను, రేవంత్ రెడ్డి కష్టపడి పైకొచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ కంటే కెసిఆర్ కొడుకంటే ఎక్కువమంది ఆయన్ను గుర్తుపడతారని మంత్రి ఎద్దేవా చేశారు. కెటిఆర్ అంటే ఎవరికీ తెల్వదని ఆయన విమర్శించారు. కెటిఆర్ ఏమైనా ప్రజా నాయకుడా..? సొంతగా ఎదిగిన నేతనా? ఉద్యమాలు చేశారా? అని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. పదేళ్లలో వందల దేశాలు తిరిగి వేల కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. అన్ని దేశాలు తిరిగి కెటిఆర్ ఏమీ సాధించాడని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓఆర్‌ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లాంటివి కట్టామని ఎన్నో ఎంఎన్‌సి సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడ్డాయని ఆయన తెలిపారు.
తాజా నివేదిక ప్రకారం నల్గొండలో ఫ్లోరైడ్ పెరిగింది
తాజా నివేదిక ప్రకారం నల్గొండలో ఫ్లోరైడ్ పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఫ్లోరైడ్ రూపుమాపామని కెసిఆర్, కొడుకు, అల్లుడు చెబుతున్నారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. మిషన్ భగీరథ కింద రూ. 6 వేల కోట్లు ఖర్చు పెట్టామని, అందులో వాళ్లు రూ. 5 వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు నాటకాల రాయుడు, పొద్దున లేస్తే పిచ్చి పట్టినట్లు మొరుగుతున్నాడని ఆయన విమర్శించారు.
ఎస్టీపిలతో సమస్య పరిష్కారం కాదు
కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ ఇంకా ఏవో పేర్లు చెప్పి బిఆర్‌ఎస్ నాయకులు రూ. 7 లక్షల కోట్లు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తమకు పదేళ్ల కింద రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేదని కెటిఆర్ అంటున్నారు, ఆయన తలకాయ ఉండి మాట్లాడుతున్నారా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎంత కష్టం అయినా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓడిపోయిన బిఆర్‌ఎస్ వాళ్లు వేరే దేశానికి వెళ్లి బ్రతుకుతారనుకున్నా, కానీ, సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో అనారోగ్యం బారిన పడిన వారు చాలా మంది ఉన్నారని, ఎన్నో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. ఎస్టీపిలతో సమస్య పరిష్కారం కాదని, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని మంత్రి సూచించారు.
సిఎంను అభినందిస్తున్నా..
ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం ఎస్‌ఎల్‌బిసి అని ఆయన తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి, మూసీ శుద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతోందన్నారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బిసిలో రూ. 5 వేల కోట్లు దోచుకుతిన్నారని ఆయన మండిపడ్డారు.
అసలు కెటిఆర్, హరీష్ రావులు నాయకులే కాదు
అసలు కెటిఆర్, హరీష్ రావులు నాయకులే కాదని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. వారికి అన్నింటిలో భాగస్వామ్యాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ సంస్థల్లో హరీష్‌కు వాటా ఉందని ఆయన తెలిపారు. కిషన్ రెడ్డికి ఏమీ తెలియదని ఆయన గురించి మాట్లాడం వేస్ట్ అని ఆయన రాజకీయ నాయకుడు కాదని మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. కెటిఆర్, హరీష్‌రావులు చాలా ముదుర్లని అందుకే వాళ్ల విషయాలు అందరికీ తెలియాలని మాట్లాడుతున్నానన్నారు. కెటిఆర్ అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసి కాళ్లు పట్టుకొని మరీ ఇండియాకు రావొద్దని బ్రతిమిలాడినట్లు ఆయన తెలిపారు.