హైదరాబాద్: జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా వేగంగా అడుగులు వేశామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి విషం చిమ్మడం బాధాకరమైన విషయమన్నారు.5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేని పోని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఆస్పత్రులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్ అండ్ బి శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరమైన విషయమన్నారు.
టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చురకలంటించారు. “ఎక్కువ అంతస్తులు ఉంటే రోగులు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి ఏం చెప్పాలో అర్థం కావడంలేదు. ఏప్రిల్ 5, 2022 న జైపూర్ లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు?, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిఎం అరవింద్ కేజ్రీవాల్ డిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు?, నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి” అని హరీష్ రావు డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలి కానీ చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని సూచించారు.