టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నల్గొండలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 30వ తేదీన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే, సీఎం ఎవరనే విషయంలో మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న క్రమంలో అధిష్టానం.. రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
సీఎంగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలంగాణలో కల్వకుంట్ల నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.