యాదాద్రి భువనగిరి: ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన దేశానికి ఒక చీకటి రోజు అని భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూరు ఖేరి జిల్లాలో రైతులు గత సంవత్సరం నుంచి నిరసన వ్యక్తం చేస్తుంటే వారి పైనుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు కాన్వాయ్ దూసుకెళ్లడంతో 8 మంది మృతి చెందడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సుద్దాల గ్రామ రైతు పెట్రోల్ బంక్, గుండాల కవర్ షెడ్ నిర్మాణానికి కోమటిరెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
పరిస్థితిని పరిశీలించడానికి ఉత్తర ప్రదేశ్ వెళ్ళిన ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ లోని క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతామన్నారు. కనీస మద్దతు ధర లేకుండా నూతన చట్టాల వలన రైతులు అడ్డికి పావు షేరు లెక్కన వరి ధాన్యాన్ని రోడ్ల మీద కుప్పలు పోసి రెండు మూడు నెలలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. దేశంలో వరి పంట పై ఆధారపడి 50 నుంచి 60 శాతం మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని, తక్షణమే రైతు చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -