హైదరాబాద్ : మునుగోడు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపిలోకి చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ రోజున తెలంగాణకు అమిత్‌షా రానున్నారు. ఢిల్లీలో శుక్రవారం అమిత్‌షాను కలిసిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుం దన్నారు. అమిత్‌షా తనను పార్టీలోకి ఆహ్వానించారని, రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తు న్నానని ఆయన చెప్పారు.
మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. బహిరంగ సభ పెట్టి బిజెపిలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ లేకున్నా.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. అమిత్‌షా సమక్షంలో తనతో పాటు మరికొందరు బిజెపిలో చేరతారని ఆయన వెల్లడించారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 8న స్పీకర్ లేకుండా అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇస్తానని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో వెంకటరెడ్డి కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటరెడ్డి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.