Thursday, December 12, 2024

7న బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ప్రారంభించనున్న సిఎం

- Advertisement -
- Advertisement -

ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఈనెల 7తో సంవత్సరం నిండుతున్న సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్‌ఎల్‌బిసి వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన ‘రాజీవ్ ప్రాంగణం‘ లో లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈనెల 7న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం వస్తున్న దృష్ట్యా సిఎం రాక ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం నూతన వైద్య కళాశాల వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందుగా సుమారు రూ.1000 కోట్లతో చేపట్టిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. దీని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని, నార్కెట్‌పల్లి వంటి ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న మండలానికి బ్రాహ్మణ వెల్లెంల ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బిసికి సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి రూ.4540 కోట్లు పెంచి మంజూరు చేశారని అన్నారు. 4000 నుండి 6000 క్యూసెక్కుల నీటితో నాలుగు లక్షల ఎకరాలకు ద్వారా సాగునీరు వస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం కానున్నదని, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ద్వారా సాగునీటిని తీసుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో యూనిట్ -2 ఎనర్జైజేషన్ ప్రారంభం తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎల్‌బిసి గంధ వారి గూడెం వద్ద రూ. 275 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభిస్తారని తెలిపారు. అక్కడే రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సెట్విన్ ద్వారా మహిళలకు ఉద్దేశించిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారని, లైబ్రరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, కంగల్, తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలు మంజూరయ్యాయని, వాటికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నార్కెట్పల్లి, దామరచర్ల మండలాలకు డిసెంబర్ 9 తర్వాత జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తూ జీఓ రానుందని వెల్లడించారు.

పది కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డిగూడెం వద్ద టూరిజం ద్వారా హరిత హోటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో మూసీ ప్రక్షాళన కోసం రూ.25 వేల కోట్లతో టెండర్లు పిలిచి దశలవారీగా పక్షాళన చేపట్టనున్నామని తెలిపారు. ప్రజా పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న నల్గొండ బహిరంగ సభకు లక్ష మంది ప్రజలు హాజరుకానున్నారని, ప్రజలందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నకిరేకల్, మిర్యాలగూడ ఎంఎల్‌ఎలు వేముల వీరేశం , బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్‌పి రాములు నాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, ఆర్‌డిఓ అశోక్ రెడ్డి, డిఎస్‌పి శివారాం రెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News