Wednesday, January 1, 2025

మామను ఇరికించేందుకే హరీష్ రావు సిట్:మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

మామ, బామ్మర్థిని ఇరికించేందుకే అసెంబ్లీ వేదికగా హరీష్ రావు సిట్ కోరారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు మంజూరుపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓఆర్‌ఆర్ టోల్లీజ్ పై సిట్ వేయాలని హరీష్ రావు కోరారని, ఆయన అసెంబ్లీలో అడిగినందుకే సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాక ఓఆర్‌ఆర్ టోల్ లీజ్ విషయంలో తన మామ, బామ్మర్ధిని ఇరికించేందుకే హరీష్ రావు సిట్ కోరారని బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ పై విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ దొంగలు దొరికారని, త్వరలోనే ఓఆర్‌ఆర్ టోల్ లీజ్ అవకతవకలు కూడా బయటపడతాయని చెప్పారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఢిల్లీలో ఉండి ఎంతో కృషి చేశానని, 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు మా కృషి వల్ల ముందడుగు పడిందని తెలిపారు. అదేవిధంగా ఆర్‌ఆర్‌ఆర్ మంజూరు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అంతేగాక దీనికి సహకరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు.

ఓఆర్‌ఆర్ అమ్ముకున్న వాళ్లపై విచారణకు ఆదేశించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 7,300 కోట్లకు ఓఆర్‌ఆర్ ను అమ్ముకుందని, హరీష్ రావుకు, మామ మీదనో, బామ్మర్ధి మీదనో కోపం ఉందని, అందుకే అసెంబ్లీలో విచారణకు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ ఫార్మూలా రేసులో ఒకరో ఇద్దరో జైలుకు పోతారన్నారు. 50 శాతం తెలంగాణను నగరీకరణ చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అని, 2017లో ఇన్ ప్రిన్సిపుల్ గా మంజూరు అయినప్పటికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఆరేళ్లు ఆలస్యం అయ్యిందన్నారు. తాను మంత్రి పదవి చేపట్టిన రెండో రోజే డిసెంబర్ 9న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్ విన్నవించానని, ముఖ్యమంత్రితో కలిసి అనేకసార్లు కేంద్ర పెద్దలను కలిశామన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి జైకా సంస్థ ద్వారా 6500 కోట్ల రూపాయల రుణం తెచ్చి మూడేళ్లలోలో ఓఆర్‌ఆర్ ను నిర్మించారని, అక్కడే 24 నెలల్లో శంషాబాద్ లో ఎయిర్ పోర్టును నిర్మించారన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. కేసిఆర్ మొన్న ఎలక్షన్ల ముందు ఓఆర్‌ఆర్ ను 7300 కోట్లకు అమ్మేశారని, ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ఆ రోజుల్లో 6500 కోట్లు అయితే,

అక్కడ భూమి విలువ లక్ష కోట్లుంటే కేవలం 7300 కోట్లకు కేసిఆర్ అమ్ముకోవడం దారుణమని విమర్శించారు. ఆర్‌ఆర్‌ఆర్ ను కేసిఆర్ ఆరు సంవత్సరాలు పెండింగ్ లో పెట్టారని, తాము వచ్చే మూడేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్ ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. వారం రోజులు ఢిల్లీలో ఉండి నితిన్ గడ్కరీని కలిసి అడిగితే 20 రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారని, పిలిచారని వివరించారు. ముఖ్యమంత్రి, తాను అనేకసార్లు ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ లోపభూయిష్టమైన విధానాలతో హైదరాబాద్ లో సామాన్యులకు సొంత ఇల్లు భారమైందన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన కానుక రీజినల్ రింగ్ రోడ్డు అని, ఆర్‌ఆర్‌ఆర్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తాను, ముఖ్యమంత్రి , మా అధికార బృందం అంతా కలిసి ఏడాదిలో ఆర్‌ఆర్‌ఆర్ సాధించామన్నారు. మార్చిలో ఆర్‌ఆర్‌ఆర్ పనులు ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని, తమ పోటి ప్రపంచంతోనే అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని స్పష్టం చేశారు.

నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను నిర్వర్తిస్తా : రెడ్డి హాస్టల్ మొదటి అల్యూమిని సమావేశ అనంతరం మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. రెడ్డి హాస్టల్ అల్యూమిని ఛైర్మన్ గా ఎన్నుకున్నందుకు, తనమీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ బాధ్యతలను నిర్వర్తిస్తానన్నారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ హాస్టల్ అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తానన్నారు. హాస్టల్ కోసం ఒక ఎకరం భూమి కావాల్సి ఉందని, రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి ప్రభుత్వంలో చర్చించి బడ్జెట్ మంజూరు చేయిస్తానన్నారు. రెడ్డి హాస్టల్ లో అన్ని కులాలవారు చదువుకుంటారని, అన్ని వర్గాల ప్రజలకు విద్య అందుబాటులో ఉండాలని ఆ రోజు రాజ బహద్దుర్ వెంకట రామారెడ్డి రెడ్డి హాస్టల్ తో పాటు అనేక విద్యాసంస్థలను స్థాపించారని, ఇంత మంచి ఆర్గనైజేషన్ లో తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

కోమటిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రికి ఫోన్ చేసి అభినందించారు. మీ కృషి, మీ సహకారం, మీ సలహాతోనే ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని ముఖ్యమంత్రికి మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు మీ అనితరసాధ్యమైన సహకారంతోనే సంవత్సరంలో సాధ్యమైందని మంత్రి వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి, మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

పేదవిద్యార్ధి చదువుకు మంత్రి చేయూత : నిరుపేద అర్కిటెక్ట్ విద్యార్ధిని ప్రణవి ఇటలీ విద్యకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. ఇటలిలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినో (పాలిటో) లో అర్కిటెక్చర్ కన్ స్ట్రక్షన్ లో మాస్టర్స్ లో ప్రణవి చొల్లేటికి సీటు వచ్చింది. కానీ, ఆర్ధికంగా తమ కుటుంబం అంత భరించేస్థితిలో లేదు సర్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రణవి చొల్లేటి అనే విద్యార్ధిని విన్నవించింది. విషయం తెలుసుకున్న మంత్రి ఆదివారం ఉదయం ఇంటికి పిలిపించుకుకుని లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. అందించడమే కాకుండా చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదనవ్యక్తం చేశారు.

ప్రతిభ కలిగిన ఏ విద్యార్ధి చదువు ఆగిపోకూడదని తెలిపిన ఆయన జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్కటేనన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయంపై ప్రణవి ఆనందం వ్యక్తం చేశారు. సర్ నా పరిస్థితి ఇలా ఉందని తెలియగానే స్పందించి నువ్వు ఏం భయపడకు ప్రణవి..నేనున్నా అని భరోసా ఇచ్చారని..ఈ రోజు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు. మంత్రి అందించిన తోడ్పాటుతో ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడి నాలాంటి వాళ్లకు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. కోమటిరెడ్డి ఇప్పటికే ప్రతిభ కలిగి, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఎందరో విద్యార్ధులకు సహాయ సహాకారాలు అందిస్తున్నారని వారి మంచి మనసుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రణవి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News