Monday, December 23, 2024

నల్గొండ నుంచే పోటీ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించేశారు. నల్గొండ అంటే ప్రాణం అంటూ వచ్చే ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి భువనగిరి ఎంపిగా ఉన్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో పోటీ చేస్తానని కోమటిరెడ్డి చెప్పడంతో ఉత్తమ్ ఎలా స్పందిస్తారో అని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా? బిజెపిలో చేరుతారా? అనే డైలమా కొనసాగింది.

దీని పైన కోమటిరెడ్డి పార్టీతో పాటుగా తాను పోటీ చేసే నియోజకవర్గం పైన క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 28వ తేదీన నల్గొండలో నిర్వహించే నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్నారు. సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా జూన్ మొదటి వారంలో నల్గొండలో సభ నిర్వహిస్తామని, ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. నల్గొండలో ప్రియాంక గాంధీ టూర్ ను సక్సెస్ చేస్తామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు నల్గొండ నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

2009లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. ఆ తరువాత రోశయ్య కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేసారు. 2018 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్ది కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలుపొందారు. ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే నియోజవకర్గంలో పర్యటనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముందు నుంచే తన పోటీ గురించి స్పష్టత ఇస్తున్నారు.

కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక సభ నల్గొండలో ఏర్పాటు చేయటం ద్వారా ఇక అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని కోమటిరెడ్డి భావిస్తున్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లింలు, దళితులు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో, ఇక కోమటిరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News