Friday, January 3, 2025

పదేళ్లు రేవంతే సిఎం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూప్‌లు లేవు.. ఏక్‌నాథ్ షిండేలు లేరు
రేవంత్ నాయకత్వంలో టీంవర్క్‌గా పని చేస్తున్నాం
హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి

మన తెలంగాణ /నల్గొండ రూరల్: రాష్ట్రంలో ఈ ఐదేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సిఎంగా ఉంటారని రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపి అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు, బిజెపి ఎల్‌పి నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

తమ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా టీం వర్క్ గా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్లు రేవంత్ రెడ్డి సిఎంగా ఉంటారని అన్నారు. తమ పార్ట్టీ లో ఏక్‌నాథ్ షిండేలు లేరని, గ్రూపులు లేవని అన్నారు. ఏక్‌నాథ్ షిండే అనే పదం బిజెపి సృష్టించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఎన్‌సిపి, శివసేనను వేరు చేసి సంతలో పశువులు కొన్నట్లు ఎంఎల్‌ఎలను కొన్నారని మండిపడ్డారు. అది ఇక్కడ వర్తించదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో పది గ్రూపులు ఉన్నాయంటూ మ హేశ్వర్ రెడ్డి మాట్లాడం పట్ల మండిపడ్డారు. బిజెపిలో గ్రూపులు లేవా అని ప్రశ్నించారు. ‘కరీంనగర్ ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్‌ను దింపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడు చేశారో నీకు తెలుసా’ అని మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. దళితులను అడ్డం పెట్టుకొని పదేళ్లు ప్రజలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. డి ప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అంటే తమకు అపారమైన గౌరవం ఉందన్నా రు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడం ఇష్టం లేకనే కెసిఆర్ 13 మంది కాం గ్రెస్ ఎంఎల్‌ఎలను కొన్నారని విమర్శించారు. ఇప్పటికైనా హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలవడం ఖాయమన్నారు.

బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవడం కష్టమన్నారు. మహేశ్వర్ రెడ్డి ఇప్పటికైనా పనికిరాని చిట్‌చాట్‌లు బంద్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు దేశ ఐక్యత కోసం జరుగుతున్న ఎన్నికలని అన్నారు. బిజెపి మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నల్గొండ ఎంపి అభ్యర్థి రఘువీర్ రెడ్డిని కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విలేకరుల సమావేశం లో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News