Friday, December 20, 2024

జూన్ 5న కాంగ్రెస్‌లోకి 25మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ 5న 25 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లోకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశా రు. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపి అభ్యర్థులు కూడా తమ పార్టీలోకి వస్తామని తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మూడోసారి ప్రధాని అయితే దేశంలో ఎన్నికలే జరగవని, ఓట్ల కోసం ఆయన మతాల మధ్య చిచ్చుపెడు తున్నారని ఆరోపించారు. దేశం మొత్తం బిజెపి నాయకుల ఆధీనంలోకి వెళ్తుందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘కెసిఆర్ చెప్పినన్ని అబద్ధాలు ప్రపంచంలో ఏ నేత కూడా చెప్పలేదు. అధికారంలోకి వస్తే దళితుడిని సిఎం చేస్తానని గులాబీ అధినేత లక్షసార్లు చెప్పారు. గత ఎన్నికల్లో నల్లధనం తెస్తామని ప్రచారం చేసి గెలిచిన మోడీ, ప్రస్తుతం రాముని జపం చేస్తున్నారు. అదానీ, అంబానీ చేతుల్లో దేశ సంపద ఉంది. జిఎస్‌టి రూపంలో భారీ మోసం జరుగుతోంద‘ని కోమటిరెడ్డి తీవ్ర  ఆరోపణలు చేశారు.

కెసిఆర్ అబద్ధాలు రామాయణం కంటే పెద్దగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. డిపాజిట్‌ల కోసమే ఆయన బస్సు యాత్ర చేస్తున్నారన్నారు. ఓట్ల కోసమే బిజెపి రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కెసిఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయని పేర్కొన్నారు. ఆ 154 సీట్లలో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చాక సోనియా గాంధీ కాళ్లను కెసిఆర్ మొక్కారని తెలిపారు. అప్పటి టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మోసగించారని మండిపడ్డారు. ’2013లో నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మార్చుతానని అన్నారు. 500 బహిరంగ సభల్లో ప్రధాని కావాలని బయట దేశంలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి పేదవారి ఖాతాలో వేస్తామని అన్నారు. చెప్పిన మాట మీద నిలబడలేదు.

ఇచ్చిన ఒక్క హామీ అమల్లోకి తీసుకురాలేద’న్నారు. త్వరలో బిఆర్‌ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత మద్యం కేసులో ఇరుక్కొని తెలంగాణ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందనుకున్నామని, కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని గుర్తించలేక పోయామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందని, అయినప్పటికీ తలసాని మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కెసిఆర్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటానన్న తలసాని, తర్వాత మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడని సెటైరు ్ల వేశారు. రాముడి పేరు మీద బిజెపి రాజకీయం చేస్తోందని విమర్శించారు. పదేండ్లు ప్రధాని ఉండి రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బిజెపి నాయకులు మత కలహాలు రేపుతున్నారని మండి పడ్డారు. ఓట్ల కోసం బిజెపి చిల్లర రాజకీయం చేస్తుందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల ముచ్చట ఏమైంది? అని ప్రశ్నించారు.

మరో పదేళ్లు రేవంత్ సిఎం.. జూన్ 5న తెలంగాణ భవన్ క్లోజ్ –
మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే సిఎంగా ఉంటారని స్పష్టం చేశారు. 20ఏండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డిలా రేవంత్ పాలన ఉందన్నారు. తనకు పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు తాను కనీసం గది నుంచి కాలు బయట పెట్టలేదన్నారు. కొందరు డిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారన్నారు. కానీ తాను మాత్రం ఎక్కడికీ వెళ్ళలే దన్నారు. 5 సార్లు ఎంఎల్‌ఎగా గెలిచాను, ఒక సారి ఎంపిగా గెలుపొందానన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ ఎన్నికలు జరుగు తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చాక సోని యా గాంధీ కాళ్లను కెసిఆర్ మొక్కారని తెలిపారు. అప్పటి టిఆర్‌ఎస్ (బిఆర్‌ఎస్)ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మోసగించారని కెసిఆర్‌పై మండి పడ్డారు. ఇక, కెసిఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులు కాదు శాశ్వతంగా ఆంక్షలు విధించాలన్నారు.

రాష్ట్రంలో 14 లేదా 15 సీట్లు గెలుస్తామని ధీమా
రాష్ట్రంలో 15 సీట్లు గెలుపు తమ లక్షమని, 14 సీట్లలో తమ పార్టీ గెలుపు ఖాయమన్న ఆశాభావాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తం చేశారు. వాస్తవిక పరిస్థితులను అవలోకనం చేసుకుని తానీ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆయన తెలిపారు. పదేండ్లు కెసిఆర్‌ను ఎదిరించి పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమకు పోటీ ఎన్డీయే కూటమి తోనేనని చెప్పకనే చెప్పారు.
ఎపి ఎన్నికల్లో మా పార్టీకి ఒక్క సీటు రాదు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైనా స్పందించారు. ఎపిలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి ఎంపిగా షర్మిల పోటీ చేస్తున్నారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా షర్మిల పిసిసి చీఫ్‌గా అయినా సరే ఒక్క సీటు కూడా రాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చేశారు. షర్మిలకు మనోధైర్యం ఇచ్చేలా కొన్ని మాటలు అయినా చెబితే బాగుండేదన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.

జర్నలిస్ట్‌ల సమస్యలు పరిష్కరిస్తాం
జర్నలిస్ట్‌ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం జర్నలిస్ట్‌లకు ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదన్నారు. వరంగల్‌లో జర్నలిస్ట్‌లకు ఇచ్చిన హామీలు చూస్తే నవ్వు వస్తుంది..బ్రహ్మ నందం జోక్ లాగా కెసీఆర్ మాటలు ఉంటాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత త్వరలో కొత్త ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
రైతులను తిట్టినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం
తాను రైతులను ఎప్పుడు తిట్టలేదని, తాను రైతులను తిట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. వెంకట్ రెడ్డి తిడితే పేరు వస్తుందని తన పేరు ప్రచారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం సోమేష్ కుమార్ లాంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లను పెట్టుకుని పాలన చేశారని ఆరోపించారు. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తున్నాయి కాబట్టి ఏదొ మాట్లాడాలని మోడీ మాట్లాడుతున్నారన్నారు. ‘ఆర్‌ఆర్ ట్యాక్స్ కాదు మీ మోడీ పాలనలో అంత ఎఎ నడుస్తోందని, ఎఎ అంటే అంబాని ,అదానీకి మోడీ దోచి పెట్టారని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పార్థ సారథి,తలసాని శ్రీనివాస్ యాదవ్, వద్ధి రాజి రవి చంద్రకు తెలంగాణకి ఏమి సంబంధం? అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి తల్లికి మంత్రి పదవీ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.

కిషన్‌రెడ్డి సాయం చేయలేదు
భువనగిరి ఖిల్లాకు రూ.200కొట్లు ఇవ్వమని కిషన్ రెడ్డిని అడిగితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కిషన్ రెడ్డి కంటే ఎక్కువ నిధులు తమ నియోజకవర్గంకు తెచ్చుకున్నట్లు వెల్లడించారు. రాముడు గీముడు అని మోడీ అంటాడని, తాను నల్గొండలో రామాలయం కట్టించానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కెసిఆర్, మోడీ ఒక్కటే
కెసిఆర్, మోడీ ఒక్కటేనన్నారు. నల్గొండ ,భువనగిరిలో డమ్మి అభ్యర్థులను పెట్టాడని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రగతి భవన్ ఫలక్ నామా ప్యాలెస్‌లాగా ఉందని పేర్కొంటూ, ప్యాలెస్‌ను వదిలి చిన్న ఇంట్లోకి వచ్చే సరికి బుద్ధి కరాబ్ అయ్యిందని కెసిఆర్‌నుద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు.
అన్నీ కక్కిస్తాం…
కెసీఆర్ కోకాపేటలో నాలెడ్జ్ సెంటర్ కోసం తీసుకున్న 11 ఎకరాలు మళ్ళీ తాము తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
సగం రావు లు ఇప్పుడు జైల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో దోచుకున్న సొమ్ము, టానిక్ వైన్ షాప్‌లో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని వెల్లడించారు. ఫాం హౌస్,ప్రగతి భవన్ ముందు పోయేటట్టు ఉండాలని ఆర్‌ఆర్‌ఆర్ అలైన్ మెంట్ చెంజ్ చేశారని ఆరోపించారు..

మరోవైపు నమో గంగాకు ఇచ్చినట్టు మూసికి 20,000 వేల కోట్లు ఇవ్వాలని మోడీనీ 14 సార్లు మొక్కాను కానీ రూపాయి ఇవ్వలేదన్నారు. ఇంకోవైపు ‘సావు నోట్లోకి పోయి వచ్చిన నేను ఎప్పుడు అనలేదు.. కానీ ఇంజక్షన్ తీసుకున్న కెసీఆర్ చెప్పుకుంటున్నాడ’న్నారు. అంతేకాదు, ‘యాదగిరి గుట్ట మీద కెసీఆర్ బొమ్మ ,కారు బొమ్మ వేసుకున్నాడు అందుకే ఓడిపోయిండు, దేవుడు చూసిండ’ని సెటైర్లు వేశారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, ఢిల్లీలో ఐకానిక్ టవర్స్
పాటిగడ్డ లో 9ఎకరాలలో హైదారాబాద్ కలెక్టర్ ఆఫీస్ కడుతున్నామన్నారు. అదే విధంగా ఢిల్లీలో ఐకానిక్ టవర్స్ కడుతున్నామని చెప్పుకొచ్చారు. తనకు నచ్చిన శాఖ రోడ్లు భవనాల శాఖ అని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు వనజ, సంయుక్త కార్యదర్శులు హరిప్రసాద్, రమేష్ వైట్ల, కోశాధికారి రాజేష్, ఇసి సభ్యులు ఉమ దేవి, శ్రీనివాస్, వసంత్ కుమార్, తిగుళ్ళ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News