Wednesday, January 22, 2025

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్…

- Advertisement -
- Advertisement -

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎఐసిసి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు
10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

Show cause notice to Komati Reddy Venkat Reddy

మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరిన సమయం నుంచి వెంకటరెడ్డి వర్సస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు. వరుస పరిణామాల నేపథ్యంలో పార్టీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లుగా వైరల్ అయిన ఆడియో విషయంలో పార్టీ క్రమ శిక్షణా చర్యలలో భాగంగా ఎంపికి పోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోరాదో 10 రోజులలో సమాధానం చెప్పాలని వెంకట్‌రెడ్డికి గడువు ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేస్తారోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కుట్రల కామెంట్లకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత జబ్బర్ భాయ్‌కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి తన సోదరుడు, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని ఆయన కోరినట్లు ఆడియో వైరల్ కావడం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపడానికి బదులుగా బిజెపి నేత రాజగోపాల్ రెడ్డికి సహకారం అందిస్తున్నారని అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో వైరల్ అయినట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఈ విషయంపై పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటి, ఎఐసిసి కార్యదర్శి తారిఖ్ అన్వర్ ఎంపివెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇది క్రమశిక్షణా ఉల్లంఘన చర్య అని, మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భారత్ జోడో యాత్ర, అటు మునుగోడు ఉప ఎన్నిక వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లటం వివాదాస్పదంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో తమ్ముడుకు వ్యతిరేకంగా పని చేయటం ఇష్టం లేకనే ఆయన విదేశీ టూర్ కు వెళ్లారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఆడియోలో ఉన్నది ఇదే…
‘రేపు ఏం జరిగినా రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. నేను పీసీసీ ప్రెసిడెంట్ అవుతాను. అన్నీ నేను చూసుకుంటా. ఈసారి పార్టీలకతీతంగా సాయం చేయండి. ఈ దెబ్బకు నేను పిసిసి ప్రెసిడెంట్ అవుతా. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తాను. మనిషిని చూసి చేస్తున్నాం పార్టీ కాదు. ఈ ఒక్క సారికి పార్టీలు చూడకండి. నేను వచ్చి కలుస్తాను.‘ అని ఆడియోలో వాయిస్ ఉంది.
‘ఇలా ఎవరు మాట్లాడినా తప్పే… కార్యకర్తలే బుద్ధి చెబుతారు’
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఇది ఎవరు చేసినా తప్పేనని, చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలే ఇలాంటి వారికి బుద్ధి చెబుతారన్నారు.
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ గుబులు..
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అక్కడ ఉండి మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా ఉపయోగం లేదన్నారు. ప్రచారం చేసినా వస్తే 10 వేల ఓట్ల వరకు వస్తాయని వ్యాఖ్యా నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుందని తెలిసి, ప్రచారం చేయడంలో అర్థం లేదని వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News