హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు లేడని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఆదివారం సమావేశమయ్యారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి పదోన్నతి రావడం, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటంతో కోమటిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అయితే వీరిద్దరూ సమావేశం సాధారణమే అని తెలుస్తున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.
రేవంత్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు
రాష్ట్ర పిసిసి చాలా చిన్న పదవని, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురించి తన వద్ద మాట్లాడొద్దని ఎంపి కోమటిరెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చిన్న పిల్లవాడని, తనకు పిసిసి పదవి రాకపోయినప్పటికీ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. తాను రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పానని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సమర్థవంతమైన నేత లేడని తేల్చిచెప్పారు. తనవంతు ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతానని తెలిపారు.
Komatireddy Venkatreddy meets Kishan Reddy