యాదాద్రి భువనగిరి: ఉద్యోగులకు జీతాలు కొన్ని జిల్లాల్లో ఇంకా పడలేదని.. ఝార్ఖండ్, బీహార్ లో కూడా టైంకు జీతాలు పడుతున్నాయని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో వెంకట్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “తెలంగాణ దేవత సోనియా హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నాం. అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. మహిళలు, వృద్దులు, వాహనాలు పెట్టమని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు తరలి రావాలి. నల్లగొండ నుంచి పోటీ చేసేది పక్కా.. ఇక్కడ యాభై వేలతో గెలిపించేది పక్కా. గతంలో కేసీఆర్ కొంగర కలాన్ లో సభ పెడితే, రూ.500 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల మంది రాలే. ఇప్పుడు సోనియా సభకు 10 లక్షల మంది కంటే ఎక్కువే వస్తారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎన్నికలు రాగానే దళిత బందు లాంటి పథకాలు తీసుకువస్తున్నారు. తెలంగాణ పౌరుషం కావాలా?, బానిసత్వం కావాలా అని కెటిఆర్ మాట్లాడుతున్నారు. ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలే కెటిఆర్.. పనికి రాని మాటలు మాట్లాడుతున్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే ఎప్పటికీ రాకపోయి ఉండేదని, కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ సోనియా గాంధీని కలవలేదా?. ఔటర్ రింగ్ రోడ్డుతో రైతుల భూములు గుంజుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాలుగుకొట్ల మంది ప్రజల కోసం అధికారంలోకి రావాలి. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వటం లేదు. కర్ణాటకలో ఎలాంటి పథకాలు వచ్చాయో… ఇక్కడా చేస్తాము. ఇందిరమ్మ ఇళ్లు కట్టాము. రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లు కట్టామని చెబుతున్నారు.. అది వాళ్ళ కార్యకర్తలకే సరిపోయింది.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా కష్టపడి పనిచేస్తాము. ప్రజలు గెలిపించాటానికి సిద్దంగా ఉన్నారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో 23 మోటర్లకి ఒక్క మోటార్ రేపు ప్రారంభిస్తున్నారు. ఇది ఎన్నికల కోసమే. రైతు భార్యా భర్తలు కరెంట్ షాక్ తో మృతి చెందారు. వారిని కవలడానికే ఈరోజు వచ్చాను. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లు రద్దు చేశారు. మద్యం టెండర్ లు విజయవంతం చేశారు. వచ్చే ఆదాయమే ముఖ్యమా?. ప్రజలు అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. ఎపిలో పార్టీ నష్టపోయినా తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ. భువనగిరి పట్టణంలో అంబేడ్కర్ భవన్ కి రూ.5 కోట్లు ఇవ్వలేరా?, పట్టణంలో ప్రజల ఆస్తులు కూల్చి నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ మూడు నెలలు కష్టపడి పని చేద్దాం.సమావేశం విజయవంతం చేద్దాం. 40 ఏళ్ల తరువాత భువనగిరి కోటపై, ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జండా ఎగుర వెద్దాం” అని పిలుపునిచ్చారు.