అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల వివాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. చచ్చిన బీఆర్ఎస్ పార్టీని బ్రతికించడం కోసం డ్రామాలాడుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని..వాళ్లు వాళ్లు కొట్టుకుని.. దీన్ని తెలంగాణ సమాజంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ ఉండేదా?..ఆ పార్టీ నాయకులను రోడ్లమీద తిరగనివ్వమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు అందరూ సంయమనం పాటించాలని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు.
కాగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పుతానని సవాల్ చేసిన కౌశిక్ రెడ్డి పొలిటికల్ వార్ కు తెరలేపారు.దీంతో అరికెపూడి తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో ఉద్రిక్తిత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు గాంధీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సీపీ ఆఫీస్ లో కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక, శుక్రవారం ఉదయం అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.