కొమురవెళ్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, మల్లన్న పట్నం వారం ఆదివారం ప్రారంభమైంది. మొదటి వారం ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొమురవెళ్లి మల్లన్న నామస్మరణ, శివసత్తుల పూనకంతో కొమురవెళ్లి క్షేత్రం మారుమోగింది. వేకువ జాము నుంచే భక్తులు కోనేటిలో స్నానాలుచేసి బోనాలు పూజించి గంగరేగి చెట్టుకింద పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొమురవెళ్లి ఆలయ చైర్మన్ దువ్వల మల్లయ్య, ఈవో బాలజీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
కరోనా నిబంధనల మేరకు భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని మైక్‌లో ఎప్పటికప్పుడూ అనౌన్స్ చేశారు. తాగునీటి సదుపాయాలతో పాటు చలువ పందిర్లు వేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేసి ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏఈవో శ్రీనివాస్, అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రేపు పెద్ద పట్నం, అగ్నిగుండాలు
సోమవారం ఉదయం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం కొమురవెళ్లి క్షేత్రం తోటబావి వద్ద ఒగ్గు పూజరులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచివచ్చే భక్తులు తమ సొంత ఖర్చులతో పంచరంగులతో పెద్ద పట్నం వేయించనున్నారు. అనంతరం అర్చకులు, భక్తులు భక్తి శ్రద్ధలతో పట్నం తొక్కుతారు. ఈ వేడకును తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.