Sunday, November 17, 2024

కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం: పట్టు వస్త్రాలు సమర్పించిన హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మల్లన్న కల్యాణోత్సవానికై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెంలో నెత్తిన పెట్టుకుని సంప్రదాయ బద్దంగా మేళ, తాళలతో వచ్చి సమర్పించారు. బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం జరిగింది.
మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తున్నది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ మహోత్సవం జరిగింది. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా… వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఆలయ ప్రాంగణం, చుట్టూ పక్కల అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు, స్థానిక జనగామ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, భువనగిరి ఏంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Komuravelli Mallanna Kalyana Mahotsavam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News