Wednesday, November 6, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్‌రావు
హుజురాబాద్‌లో ఘనంగా కొండాలక్ష్మణ్ బాపూజీ
106వ జయంతి ఉత్సవాలు

Konda laxman bapuji life is ideal
మనతెలంగాణ/హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్‌రావు వ్యాఖ్యానించారు. ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలను బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల అశోక్ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వకుళభరణం కృష్ణమోహన్ రావు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనిషి, స్వతంత్ర సమరయోధుడు అని పేర్కొన్నారు. జాతీయ నాయకులలో మహోన్నత వ్యక్తిత్వంతో అందరిని ఆకట్టుకున్న మానవతావాదని కొనియాడారు.

ఆయన వ్యక్తిత్వం విశిష్టమైనది, జీవిత లక్ష్యాలు, మహోన్నతమైనవి, సంకల్పబలం హిమాలయా సమున్నతమైనదని చెప్పారు. పదవుల కోసం ఎన్నడు రాజీపడలేదని, నిర్మొహమాటంగా ఉంటూనే అందరినీ కలుపుకుపోయే ప్రత్యేక శైలి ఆయనదని అన్నారు. ఆయన ఇల్లు జలదృశ్యం ఒక గ్రంథాలయమని, ఆ గ్రంథాలయంలో ఎవరైనా వచ్చి చదువుకోవచ్చని చెప్పారు. ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవారని, మాజీ మంత్రిని అనే అహంకారం ఆయనలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. ఒక మనిషిగా ప్రతి ఒక్కరిని గౌరవించే గొప్ప వ్యక్తిత్వం ఆయనదని వ్యాఖ్యానించారు.

బిసిల రిజర్వేషన్ గురించి ఆయా కులాల వృత్తి సహకార సంఘాలకు సబ్సిడీ రుణాల గురించి, రాయితీల గురించి యువతరం ఉన్నత విద్య అందుకోవడం గురించి, చేనేత అభివృద్ధి గురించి, దళితుల హక్కుల గురించి ఆయన చేపట్టని కార్యక్రమం లేదని అన్నారు. ఉమాశంకర్ దీక్షిత్ చాడీలు చెప్పి ఇందిరా గాంధీ వద్ద బాపూజీ ప్రతిష్టను దెబ్బ తీసినప్పుడు కూడా కుంగిపోలేదని చెప్పారు. గవర్నర్ పదవి కూడా వద్దని సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు.

తెలంగాణ స్వతంత్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా నియమించినప్పుడు ఎవరు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారో వారి కేసులను ప్రతిదీ ప్రత్యక్షంగా పరిష్కరించారని తెలిపారు. కొడుకును భారత్ పాకిస్తాన్ యుద్ధానికి పంపించారని, ఆయన సతీమణి యుద్ధంలో డాక్టర్‌గా సేవలు అందించారని… ఇలా కుటుంబం మొత్తం దేశ సేవకు, సామాజిక సేవకు అంకితం చేసిన బాపూజీ వంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన ఆకాక్షించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహా సభ రాష్ట్ర నాయకులు శ్రీహరి యాదవ్, బిసి సంక్షేమ సంఘం సదానందం, నాయకులు కన్నబోయిన మహేందర్ యదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏనూరి అశోక్, బద్దుల రాజకుమార్, శ్రీనివాస్ యాదవ్ అల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News