మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది దాన్యం గణనీయమైన దిగుబడి వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి సరిగా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. ఈ ఏడాది యాసంగి మార్కెట్‌కు సీజన్‌కు సంబంధించి ఇటీవల పడుతున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గోదాముల వద్ద ధాన్యం తడిసి ముద్దైపోతుంది. ఈ తడిచిన ధాన్యం కొనేందుకు పౌరసరఫరాల సంస్థ, రైస్ మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొత్త ఐడియాను ఆవిష్కరించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం.. వానలకు తడిసిపోతుంటే రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంపై స్పందించారు.
తరచూ కొత్త ప్రయోగాలు, ప్రజలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేపట్టే విశ్వేశ్వర్‌రెడ్డి కేవలం 500 రూపాయల ఖర్చుతో ఆరబోసిన లేదా గోదాముల బయట ఎండబెట్టిన ధాన్యంను వర్షం నుంచి కాపాడుకోవచ్చునని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చూపారు. ఈ టెక్నాలజీ ప్రస్తుతం అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి తక్కువ ఖర్చుతో అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి రైతుల కోసం తాము ఈ ఆలోచన చేశామని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కల్లంలో వంద క్వింటాళ్ల ధాన్యం నిల్వకు దాదాపు 500 రూపాయల ప్లాస్టిక్ కవర్ (ష్రింక్ వ్రాప్)అవసరమవుతుందని చెప్పారు.
కల్లంలో నేలపై పరచడానికి తాటి పత్రులు కనీసం నాలుగు అవుతాయి. ఆ ఖర్చు రూ.2 వేల చొప్పున మొత్తం ఖర్చు రూ.8వేల రూపాయలు అవుతాయని తెలిపారు. అదే రాతిబండపై అయితే తాటి ఆకులు పరచాల్సిన అవసరం పెద్దగా ఏమీ ఉండదని అన్నారు. తక్కువ ఖర్చుతో సులభంగా రైతు సొంతంగా ఈ ష్రింక్‌వాప్ ఏర్పాటు చేసుకుంటే అకాల వర్షాలు, ఎలుకల బారి నుంచి ధాన్యం జాగ్రత్తగా కాపాడుకోవచ్చని, మంచి రేటు వచ్చినప్పుడు పంట అమ్ముకుని కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా పొందవచ్చని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.