మన తెలంగాణ/హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశర రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ లేదా బిజెపిల్లో చేరాలని భావించారు. కానీ ఈ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సైలంట్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా తన నిర్ణయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. తాను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీన పడిందన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు అంత శక్తి లేదంటూ దుయ్య బట్టారు. తెలంగాణవాదులను టిఆర్‌ఎస్ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. నియంత పాలనను అంతం చేయడం బిజెపికే సాధ్యమని పేర్కొన్నారు.
తెలంగాణను వ్యతిరేకించిన వారంతా టిఆర్‌ఎస్‌లో ఉన్నారని తెలిపారు. టిఆర్‌ఎస్ కార్యకర్తల దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ తొందర్లోనే ఖతం అవుతుందని జోస్యం చెప్పారు. యాంటీ టిఆర్‌ఎస్ ఓటు బిజెపికి వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు అంశాలపై బిజెపిని వివరణ అడిగానని, రెండు అంశాలపై స్పష్టత ఇచ్చారని తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయింది. బిజెపిలో చేరాలని నిర్ణయం తీసు కున్నా. నేను రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్‌కు పిసిసి పదవి ఇచ్చారు. రేవంత్‌కు సకాలంలో పిసిసి పదవి ఇచ్చివుంటే కాంగ్రెస్‌లో ఉండేవాడ్ని. బిజెపి పూర్తి క్రమశిక్షణ గల పార్టీ. తాను పదవులు ఆశించి బిజెపిలోకి వెళ్లడం లేద’ని స్పష్టం చేశారు. కాగా, జూలై 3న బిజెపి నిర్వహిస్తున్న సభలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
Konda Vishweshwar Reddy Joins BJP