మూడు నెలలు మూసివేయనున్న పోలీసులు
ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రాడిసన్ హోటల్ వరకు లెవల్2 ఫ్లైఓవర్ నిర్మాణ పనులు
హైదరాబాద్: ఫ్లై ఓవర్ పనుల కారణంగా కొండాపూర్ జంక్షన్‌ను మూడు నెలల పాటు పోలీసులు మూసివేయనున్నారు. మూడు నెలల పాటు ఫ్లైఓవర్ పనులు నిరంతరాయంగా సాగనున్న నేపథ్యంలో రోడ్డును మూసివేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్‌నాయక్ తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డులోని రాడిసన్ హోటల్ వరకు లెవల్2 ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపట్టనున్నారు. మే 13 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొత్తగూడ వైపు వెళ్లే రోడ్డు రెండు వైపులా మూసివేస్తున్నాట్లు పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఓఆర్ఆర్ నుంచి కొత్తగూడ వైపు వెళ్లే వాహనాలు శిల్పలేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా మీనాక్షి డెలాయిట్ మీదుగా రాడిసన్ హోటల్, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లాలి. లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే వాహనాలు గచ్చిబౌలి ట్రాఫిక్ పిఎస్, డిఎల్ఎఫ్, రాడిసన్ హోటల్ నుంచి వెళ్లొచ్చు. విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు వైపు వేళ్లే ట్రాఫిక్ గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్ తీసుకుని డిఎల్ఎఫ్ మీదుగా వెళ్లాలి.
టోలీచౌకీ నుంచి ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్డుకు వెళ్లే ట్రాఫిక్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్ స్సేస్ అండర్ పాస్, సైబర్ టవర్, శిల్పారామం మీదుగా వెళ్లాలి. టెలికాం నగర్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లాల్సిన వాహనాలను గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని శిల్పా లేఅవుట్ ఫ్లైఒవర్ ర్యాంప్ పై నుంచి డెలాయిట్ రోడ్డులో వెళ్లాలి. అల్విన్ కాలనీ క్రాస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాల్సిన వాహనాలను బొటానికల్ గార్డెన్ వద్ద మసీద్‌బండ వైపు మళ్లిస్తారు. అవసరమైన చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.