సిర్పూర్ కాగజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శనివారం సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి కోనేరు కోనప్ప సిఎంతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తాను ఎమ్మెల్యేగాగా ఉన్నప్పుడు మంజూరు చేసిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, నియోజకవర్గ పార్టీ బాధ్యతలను తనకు అప్పగించాలని సిఎంకు ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. నియోజకవర్గంలో తన మాట నెగ్గడం లేదని, గతంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను పక్కన పెట్టేశారని కోనప్ప సిఎంకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.
ఈ సందర్భంగా పార్టీ మార్పు విషయమై కోనప్ప స్పందిస్తూ తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లుగా బిఆర్‌ఎస్ లో చేరబోతున్నట్లుగా జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. చివరివరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కోనప్ప ప్రకటించారు. శుక్రవారం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మీడియాకు లీక్ ఇచ్చిన కోనప్ప అనూహ్యంగా యూటర్న్ తీసుకుని మళ్లీ సిఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయవర్గాలను విస్మయ పరిచింది. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం కోనప్ప తన మనసు మార్చుకుని కాంగ్రెస్‌లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.