హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో ప్రియాంకగాంధీ సమక్షంలో నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు దామోదర్ రెడ్డి వెల్లడించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తీరుపై ఇప్పటికే కూచుకుళ్ల అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మర్రి జనార్ధన్ రెడ్డి సహకరించలేదని దామోదర్ రెడ్డి ఆరోపించారు. అప్పటి నుంచి దామోదర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతుంది.
గత నెల 10వ తేదీన కాంగ్రెస్ నేత మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్‌కు ముందే నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచరులుతో కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు సమావేశాలు నిర్వహించారు. పార్టీని వీడే విషయంపై అనుచరులతో చర్చించారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనుండడంతో జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
బిఆర్‌ఎస్‌లో చేరడానికి ముందు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన హస్తం పార్టీని వీడి బిఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి తనయుడు రాకేష్‌ను బరిలోకి దింపాలని కూచుకుళ్ల భావిస్తున్నారు. ఈ విషయమై దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో దామోదర్ రెడ్డికి ప్రత్యర్ధిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నాగర్ కర్నూల్ నుంచి పలుసార్లు నాగం టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే ఈసారి నాగం జనార్థన్ రెడ్డి కూడా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.