టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి
మనతెలంగాణ/హైదరాబాద్: దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం దారుణమని, ఈశ్వర్‌కు ఎలాంటి అవగాహన లేదన్న విషయం ఆయన మాటల ద్వారానే తెలుస్తుందని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు, మల్లు రవి ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయ్యిండంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రిజర్వేషన్లు వల్ల వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలని మల్లు రవి సూచించారు. కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులకు వ్యవసాయ భూములు, ఇళ్లు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసిన విషయం ఈశ్వర్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఈశ్వర్ కేవలం రాజకీయ ప్రకటనలు చేశారే తప్ప, ఇన్నేళ్ల పాలనలో దళిత, గిరిజనులకు బిఆర్‌ఎస్ ఏమీ చేసిందో చెప్పలేకపోయారని ఆయన విమర్శించారు. భూములు ఇస్తామని, ముఖ్యమంత్రిని చేస్తామని, రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మోసం చెసింది బిఆర్‌ఎస్ సార్టీ కాదా? అని మల్లు రవి ప్రశ్నించారు. దళిత, గిరిజనుల్లో కాంగ్రెస్ డిక్లరేషన్ పట్ల అనూహ్య స్పందన రావడంతో ఆ పార్టీ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు.