Monday, December 23, 2024

నేడు కోరల పౌర్ణమి….. ఆ పేరు ఎలా వచ్చింది

- Advertisement -
- Advertisement -

 

మార్గశిర పౌర్ణమి –కోరల పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి ‘కోరల’ పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు. మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేసింది. చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అప మృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు.

చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగి పోతాయనే నమ్మకం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News