కోట లోని కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యుజి) పరీక్షకు సిద్ధమవుతున్న వైద్య విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ యుజి పరీక్ష ఫలితాలు ప్రకటించిన మరునాడే ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలవరం కలిగిస్తోంది. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాకు చెందిన బగీషా తివారీ నీట్ యుజి పరీక్షకు ప్రిపేర్ కావడానికి కోట లోని జవహర్‌నగర్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలో తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. 12 వ తరగతి చదువుతున్న ఆమె సోదరుడు కూడా జాయింట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ) కు ప్రిపేర్ అవుతున్నాడు.
నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఏడాది జనవరి నుంచి కోటాలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల్లో ఇది పదో సంఘటనగా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరినారాయణ్ శర్మ చెప్పారు. గత ఏడాది కోచింగ్ విద్యార్థుల్లో 26 అనుమానాస్పద మరణాలు సంభవించాయి.బుధవారం మృతి చెందిన తివారీ మృతదేహాన్నిమహారావు భీమ్‌సింగ్ ఆస్పత్రి మార్చురీలో పోస్ట్‌మార్టమ్ కోసం భద్రపరిచారు. ఆమె తండ్రి వచ్చిన తరువాత పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.