Friday, December 27, 2024

కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు కొత్త బాస్..

- Advertisement -
- Advertisement -

ముంబయి: కోటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండి కం సిఇఓగా అశోక్ వాశ్వానీ నియమితులయ్యారని బ్యాంకు శనివారం ప్రకటించింది. ఈ బ్యాంక్ వ్యవస్థాపక ఎండీ కం సీఈఓగా ఉదయ్ కొటక్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అశోక్ వాశ్వానీ నియామకానికి ఆర్‌బిఐ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అశోక్ వాశ్వానీ.. అమెరికా -ఇజ్రాయెల్ ఫిన్ టెక్ సంస్థ పగయా టెక్నాలజీస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇంతకుముందు సిటీ గ్రూప్, బార్ క్లేస్ బ్యాంకు సహా పలు ఆర్థిక సంస్థల్లో పని చేశారు. డిజిటల్ బ్యాంకింగ్, కన్సూమర్ ఫోకస్ పై సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. మూడేండ్ల పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ కం సీఈఓగా అశోక్ వాశ్వానీ కొనసాగుతారని ఆర్‌బిఐ తెలిపింది. 2024 జనవరి ఒకటో తేదీలోగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉదయ్ కోటక్ రాజీనామా తర్వాత బ్యాంకులో పని చేస్తున్న వారికే ప్రమోషన్ కల్పిస్తారని వదంతులు వచ్చాయి.

ఉదయ్ కోటక్ వారసులుగా బ్యాంకులోనే పని చేస్తున్న కెవిఎస్ మణియన్, శాంతి ఏకాంబరం ఎంపికవుతారని అంతా భావించారు. మణియన్, ఏకాంబరం బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. దీనిపై ప్రస్తుత బ్యాంక్ తాత్కాలిక ఎండీ కం సీఈఓ దీపక్ గుప్తా స్పందిస్తూ.. అశోక్ వాశ్వానీ నియామకానికి బ్యాంకు బోర్డు, ఆర్‌బిఐ ఆమోదం తెలిపాయని చెప్పారు. బ్యాంకులో 26 శాతం వాటాలు కలిగి ఉన్న ఉదయ్ కోటక్ ఇకపై కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు నాయకత్వం వహించే బాధ్యతను అప్పగించడం ద్వారా తనపై నమ్మకముంచిన బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వాశ్వానీ ఒక ప్రకటనలో తెలియజేశారు.

రూ.3,191 కోట్ల నికర లాభం
ఇదిలా ఉండగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,191 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 23.66 శాతం పెరిగింది.అప్పుడు బ్యాంకు నికర లాభం రూ.2,581 కోట్లుగా ఉండింది. మరో వైపు బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ.5, 099 కోట్లనుంచి రూ.6,297 కోట్లకు పెరిగింది.బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 1.72 శాతంగా నమోదైంది.గత ఏడాది ఇది 2.08 శాతంగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News