త్యాగభరితమైన తన జీవనరాగంలో ‘కోటి రత్నాల వీణ’ ను శ్రుతి చేసి, వేయి గొంతుకలతో విముక్తి గీతాన్ని ఆలపించిన తెలంగాణ వైతాళికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఫజుల్ అలీ కమిషన్ నుండి శ్రీకృష్ణ కమిటీ వరకూ విస్తరించిన ఆరు దశాబ్దాల తెలంగాణ సాంస్కృతిక రాజకీయ ఉద్యమ ప్రస్థానానికి జయశంకర్ తాత్విక రహదారిగా భాసిల్లాడు. భారత దేశంలో కొడిగట్టిపోతున్న చిన్న రాష్ట్రాల ఉద్యమాలకు కొత్త ఊపిరి పోసి, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన నిఖిల జనావళి నీరాజనాలందుకున్నాడు. విద్యార్ధి నాయకునిగా, ఆచార్యునిగా, విద్యావేత్తగా, ఉపకులపతిగా అన్నింటికీ మించి ‘తెలంగాణ జాతిపిత’గా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి జయశంకర్ తలలోని నాలుకలా వెలుగొందాడు. జయశంకర్ అడుగు జాడలను తడిమి చూస్తే ఆత్మగౌరవ పోరాట తత్త్వం అర్థమవుతుంది.
వొడవని ముచ్చట’ లాంటి ఆ అవిశ్రాంత పధికుని జీవనపుటలను తిరగేస్తే ఓరుగల్లు కోటంత ప్రేరణ కలుగుతుంది. వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జయశంకర్ ఉర్దూ మీడియంలో ప్రాథమిక విద్యనభ్యసించి, ప్రతిష్ఠాత్మకమైన బెనారస్, ఆలిఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో డబుల్ ఎంఎ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్రంలో పిహెచ్‌డి పట్టా సాధించి, మూడు దశాబ్దాలపాటు వేలాది మంది విద్యార్థులకు సామాజిక, ఆర్ధిక పాఠాలు బోధించి, ఉత్తమ ఆచార్యునిగా ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. హైదారాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాలలో కొంత కాలం అర్థ శాస్త్ర అధ్యాపకునిగా సేవలందించి విద్యార్థుల్లో తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని రగిలించాడు. ఎమర్జెన్సీ నేపథ్యంలో అల్లకల్లోలమైన వరంగల్ సికెయం కళాశాల పరిపాలనా వ్యవహారాలను సమర్ధవంతంగా చక్కదిద్ది, పాలనా దక్షుడిగా జయశంకర్ ఉన్నతాధికారుల ప్రశంసలందుకున్నాడు. సీఫెల్ రిజిస్ట్రార్‌గా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆయన చేసిన విద్యావిషయకమైన విశిష్ట సేవలు, ప్రవేశపెట్టిన నిర్మాణాత్మకమైన సంస్కరణలు విద్యారంగంలో చిరస్మరణీయం.
ఒక మహా జలపాతం పల్ల మెరిగి ప్రవహిస్తూ జీవ నదిగా రూపాంతరం చెందినట్లు ఆర్ధికవేత్తయిన జయశంకర్, సామాజిక గమన సూత్రాలను అర్థం చేసుకొని ప్రజాస్వామ్యవాదిగా పరిణామం చెందాడు. ఉపకులపతి వంటి అత్యున్నతమైన పదవులు చేపట్టినప్పటికీ ఆస్తిపాస్తులపై ఆయన దృష్టి సారించకుండా నిరాడంబర యోగిలా నిరంతరం జీవించాడు. ప్రధాన మంత్రిని, సామాన్య కార్యకర్తను ఒకే చూపుతో దర్శించగలిగిన ఆత్మౌన్యత్యాన్నే తరిగిపోని సంపదగా భావించిన మహనీయ దార్శనికుడు జయశంకర్. ఆదర్శానికి ఆచరణకు మధ్య సమన్వయం సాధించిన అపురూపమైన జీవన శైలితో మడిమ తిప్పకుండా ఆయన మన ముందుకు సాగిపోయాడు. బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తూనే, హక్కు ల పరిరక్షణ కొరకు ఉద్యమించాలని ప్రజాస్వామ్యవాదులకు జయశంకర్ ప్రబోధించాడు. క్రమ శిక్షణాయుతమైన, ఉదాత్తమైన ఆయన వ్యక్తిత్వం నుండి మేధావులుగా చెలామణి అవుతున్న వారందరూ గుణపాఠాలు నేర్చుకోవలసిన అవసరమెంతైనా వుంది.
జయశంకర్ తనకంటూ సొంత కుటుంబాన్ని నిర్మించు కోకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలనే తన రక్తబంధువులుగా భావించి, వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. విద్యార్ధి దశ నుండే తెలంగాణ ఉద్యమ స్వరూప స్వభావాలను నిశితంగా పరిశీలించిన జయశంకర్ రాజకీయ ప్రక్రియతో పాటు ప్రజాసమూహాల్లో భావజాల ప్రచారం జరగాల్సిన అవసరముందని భావించాడు. రాజకీయ ప్రక్రియను వ్యూహాత్మకంగా, సమర్ధవంతంగా, సరికొత్త పోరాట రూపాలతో ముందుకు తీసుకెళ్లే నేతృత్వ పటిమ, అందుకవసరమైన వచోగరిమ, వెనకడుగు వేయని మొండితనం కెసిఆర్‌కు మాత్రమే ఉన్నాయని గుర్తించి, ఉద్యమ నిర్మాణంలో జయశంకర్ ఆయనకు బాసటగా నిలబడ్డాడు.
తెలంగాణ ఉద్యమ చారిత్రిక నేపథ్యాన్ని, ఉద్యమ లక్ష్యాలను, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, సహేతుకంగా విశ్లేషిస్తూ వందలాది వ్యాసాలు రాయడమే కాకుండా, వేలాది ఉపన్యాసాలిచ్చి జయశంకర్ ఉద్యమానికి కొత్త రక్తాన్ని ఎక్కించాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న పెట్టుబడిదారుల రాజకీయ కుట్రలను, చాపక్రింద నీరులా వ్యాపిస్తున్న సాంస్కృతిక వివక్షను, ప్రాంతీయ అసమానతల తీరు తెన్నులను సోదాహరణంగా నిరూపించి తెలంగాణ ఉద్యమానికి నిర్దిష్టమైన తాత్వికతను, ప్రామాణికతను చేకూర్చటంలో ప్రొ. జయశంకర్ చరిత్రాత్మకమైన పాత్రను పోషించాడు. పెద్ద మనుషుల ఒప్పందంతో పాటు, అష్టసూత్ర, పంచసూత్ర పథకాలు అమలులో పాలక వర్గాల వైఫల్యాన్ని జయశంకర్ ఎండగట్టాడు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో నిష్ణాతుడైన జయశంకర్ అంగీకారయోగ్యమైన తన వాదనా పటిమతో సీమాంధ్ర ప్రాంతంలోను, దేశ విదేశాల్లోను చిన్న రాష్ట్రాల అవసరాన్ని అద్భుతంగా చాటి చెప్పి, తెలంగాణేతరులను కూడా మెప్పించటం గొప్ప విషయం.
తరగతి గదిలో విద్యార్ధులకు పాఠాలు బోధించినట్లుగానే విద్యావంతులకు, మధ్యతరగతి మేధావులకు, రాజకీయ నాయకులకు, కవులకు, కళాకారులకు జయశంకర్ అసలైన తెలంగాణ సిలబస్‌ను నూరిపోసి ఉద్యమ వ్యాప్తికి విశేషమైన కృషి చేశాడు. సంస్కృతిని, చరిత్రను, ఇక్కడిభాషను, యాసను, నుడికారాన్ని తక్కువ జేసి చూడటం వల్ల తెలంగాణ ఉద్యమానికి ‘కల్చరల్ డైమన్షన్’ వచ్చిందని, అందుకే ఇది సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం గా రూపాంతరం చెందిదని ఆయన విశ్లేషించాడు. తెలంగాణ ఉద్యమం, దోపిడీదారులైన పెట్టుబడి వర్గాలకు, ఆర్ధిక తీవ్రవాదులకు తప్ప, సీమాంధ్రులకు వ్యతిరేకం కాదని జయశంకర్ పదేపదే ప్రస్తావించాడు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా వివక్షకు గురైన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే వివక్షతోపాటు తెలంగాణ దోపిడీకి కూడా గురైందని ఆయన వాదించాడు. అభివృద్ధి సాధనకు అధికార వికేంద్రీకరణ దోహదపడుతుందన్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ సూత్రీకరణను తెలంగాణ వాదానికి అన్వయించి అద్భుతంగా విశ్లేషించాడు.
తెలంగాణ ఎరుకతో పాటు అస్తిత్వ ఉద్యమాల దృష్టి కూడా జయశంకర్ ప్రబోధాల్లో స్పష్టంగా కనబడుతుంది. చిన్న రాష్ట్రాల్లో మాత్రమే కింది కులాలకు మేలు జరుగుతుందని ఆయన శాస్త్రీయంగా నిర్ధారించాడు. దళితులకు, ఇతర బలహీనవర్గాలకు రాజకీయ ప్రక్రియతో పాటు ఇతర అన్ని రంగాల్లో న్యాయబద్ధమైన వాటా హక్కుగా చెందాలన్న జయ శంకర్ డిమాండ్‌ను తెలంగాణ అధినాయకులు ప్రతిక్షణం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. ఆర్ధిక పునర్నిర్మాణంలో బలహీన వర్గాల పాత్ర ఎంతో కీలకమైనదని జయశంకర్ వాదించాడు.
బహుజనుల్లో సరైన ఐక్యతలేక పోవడం సామాజిక న్యాయానికి ప్రతిబంధకంగా మారిందని జయశంకర్ విమర్శించాడు. విద్యావంతులై ఆయా కులాల్లో ఒక స్థాయికి చేరుకున్నవారు, క్రింది వారికి చేయూతనివ్వాలని జయశంకర్ పిలుపు నిచ్చాడు. ముస్లింలను కూడా కలుపుకొని సమష్టి చైతన్యంతో ముందడుగు వేయాలని ఆయన నిర్దేశించాడు. దళిత బహుజనులు శక్తులు రాజ్యాధికారాన్ని కొట్లాడి సాధించుకోవాలి గాని యాచక ప్రవృత్తి మంచిది కాదని జయశంకర్ హితవు చెప్పాడు. తెలంగాణ ఉద్యమాన్ని జయా శంకర్ జీవితాన్ని వేరు చేసి చూడడం ఎవరికి సాధ్యం కాదు. తెలంగాణ బాధను తన బాధగా చేసుకొని ప్రభావశీలమైన జీవితాన్ని గడిపాడు.
ఏడు దశాబ్దా జీవితంలో ‘నాకిది కావాలని’ జయశంకర్ ఎప్పుడూ ఎవరినీ అడగలేదు. అప్పటి భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు అత్యంత సన్నిహితుడైనప్పటికీ ఆ అనుబంధాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం బొత్తిగా చేతగాని పిచ్చిమారాజు జయశంకర్. అలాంటి పిచ్చిమారాజు తన అంతిమ ఘడియల్లో ఒకే ఒక్క కోర్కె కోరాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడిలా ఆయన తన మరణాన్ని వాయిదా వేయమని అభ్యర్థించ లేదు తనువు చాలించే లోపు తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని జయశంకర్ తహతహలాడాడు. తన భావజాల వెలుగుల్లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళారా కూడకుండానే జయశంకర్ అసువులు బాశాడు. ఆ మహనీయుని ఆశయాల జాడలో బంగారు తెలంగాణను నిర్మించుకోవాలి.
డా. కోయి- కోటేశ్వరరావు 9440480274