Sunday, December 22, 2024

మహిళా వర్శిటీగా కోఠి కళాశాల

- Advertisement -
- Advertisement -

Koti Women's College will turn first women's university

ప్రతిపాదనలను సిద్ధం చేయాలి
అధికారులకు విద్యాశాఖ మంత్రి సబిత అదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : త్వరలోనే వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వ విద్యాలయంగా మార్చే అంశంపై మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి యుజిసి స్వయం ప్రతిపత్తితో, న్యాక్ గుర్తింపు కలిగిన కోఠి మహిళా కళాశాలను, మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని ప్రభుత్వం భావించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయ ఏర్పాటును వేగవంతం చేసే దిశగా పనులను చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వ విద్యాలయంగా మారిస్తే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై కూలంకషంగా పరిశోధించి ఒక నివేదిక రూపొందించాల్సిందిగా అధికారులను కోరారు.

మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటుకు విధి విధానాలు, అనుమతుల గురించి వివరాలు అందించాల్సిందిగా, ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖలోని అధికారులతో అంతర్గతంగా కమిటీ వేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో 4,159 మంది విద్యార్థినులు చదువుతున్నారని, దీన్ని మహిళా విశ్వ విద్యాలయంగా మారిస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సూచించారు. కోఠి మహిళా కళాశాలకు చారిత్రాత్మక వైభవం ఉండటంతో దాన్ని మహిళా విశ్వ విద్యాలయంగా మారిస్తే తెలంగాణ మహిళల ఉన్నత విద్యలో మహర్ధశ వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకువెళ్తాందని, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు, ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. ఈ మహిళా విశ్వ విద్యాలయంలో ఆధునిక కోర్సులు బోధించేలా చర్యలు చేపట్టేలా కోర్సులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకట రమణ, కళాశాల, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ విజులత తదితరులు పాల్గొన్నారు.

మన ఊరు-మన బడి పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా 4 స్కూళ్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి పథకాన్ని అమలు చేసేందుకు రూ.7,289 కోట్లు ఖర్చు చేయబోతున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, హైదరాబాద్ జిల్లాలోని ఆలియా, మహబూబియా బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల నిర్మాణాల కోసం రూ.3.57 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే 40% పూర్తయ్యాయని అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సబిత సమీక్ష నిర్వహించారు. భావితరాల ప్రయోజనాల పరిరక్షణకు సిఎం కెసిఆర్ దార్శనికతతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్యను అంకితభావంతో అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పాఠశాలల భవనాలను ఇతర పాఠశాలలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, పాఠశాలకు అవసరనమైన మౌళిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తున్నామని వివరించారు. పాఠశాలలకు ప్రహరీగోడలు, తరగతి గదుల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలకు విద్యుద్దీకరణ, పూర్తి స్థాయి మంచినీటి సరఫరా, పెయింటింగ్ వంటి పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో టిఎస్‌ఈడబ్లూఐడిసి ఛైర్మన్ నాగేందర్ గౌడ్, ఎండి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News