Thursday, January 16, 2025

జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘ఒకే దేశం… ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను ప్రథమ పౌరురాలికి అందజేశారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది.

కమిటీ సూచనలు
జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ సూచించింది. ఇక, మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది. దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది.

పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతు ఇచ్చాయి. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా, 21,558 స్పందనలు వచ్చాయి. వీటిలో 80 శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్ధించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోడీ ప్రభుత్వం, 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది.

కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15 వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ , సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ , కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది.

సిద్ధమవుతున్న లా కమిషన్ నివేదిక
ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా తమ నివేదికను దాదాపు సిద్ధం చేసినట్టు తెలిసింది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉందని సమాచారం. 2029 నాటికి ఏకకాల ఎన్నికల నిర్వహణ వీలయ్యేలా చేసేందుకు అవసరమైన మార్గసూచీని లా కమిషన్ ప్రభుత్వానికి అందజేయవచ్చని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News