రాష్ట్రపతి కోవింద్ పిలుపు
న్యూఢిల్లీ : మన లక్ష్యం మహిళాభివృద్ధి నుంచి మహిళా సారథ్య ప్రగతిగా ఖరారు కావల్సి ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఉద్ఘాటించారు. మహిళా సాధికారత, మహిళల ద్వారా సాధించే సాధికారతకు న్యాయ సేవా సంస్థలలో స్త్రీలకు ప్రాతినిధ్యం ఎక్కువ కావల్సి ఉందని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. జాతీయ న్యాయ సేవల అధీకృత సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆరువారాల న్యాయసేవల చేరువ, చైతన్యపు అవగావహన కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. న్యాయవ్యవస్థ అందరికీ మరింతగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రత్యేకించి అణగారిన వర్గాలకు న్యాయపరమైన సేవలు మరింతగా చేరువ కావలని పిలుపు నిచ్చారు.
మహిళలకు ప్రాతినిధ్యం, బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తేనే దీనికి సార్థకత దక్కుతుందని తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి నేపథ్యంలో గాంధీజిని సంస్మరించుకుంటూ ఆయన తమ జీవితకాలంలో పేదలు, తన వద్దకు వచ్చిన కార్మికులకు కోర్టు వ్యవహారాలలో ఎంతో సాయం చేశారని తెలిపారు. సీనియర్ , పేరు మోసిన న్యాయవాదులు తమ వృత్తిలో కొంత సమయాన్ని అయినా పేదలకు న్యాయసాయానికి వెచ్చించాలని కోరారు. ఈ సభలోనే కేంద్ర న్యాయమంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ ప్రజల వద్దకు న్యాయం అందచేత దిశలో నల్సా గణనీయ పాత్ర పోషిస్తోందని కొనియాడారు. అందరికీ న్యాయ,చట్టపరమైన అంశాలలో సరైన అవగావహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ ప్రాణం: సిజెఐ
పటిష్ట ప్రజాస్వామిక వ్యవస్థకు పటిష్ట న్యాయవ్యవస్థ అత్యవసరం అని, ఈ రెండింటి మధ్య సమన్వయం కీలకమైన అంశం అని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. దేశంలో న్యాయవ్యవస్థ మరింత పటిష్టతకు తీసుకుంటున్న చర్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగు స్పందన దక్కుతోందని, కోర్టులలో అత్యున్నత స్థాయి ఖాళీల భర్తీలకు తమ అభ్యర్థనలపై కేంద్రం అనుమతించిందని ఈ క్రమంలో ఇప్పటికే న్యాయమూర్తుల నియామకాలు చేపట్టడం జరిగిందని, ఇక త్వరలోనే సుప్రీంకొలీజీయం సిఫార్సులకు అనుగుణంగా ఖాళీల భర్తీలు జరుగుతాయనే విశ్వాసం ఉందని , కేంద్రం స్పందనకు ధన్యవాదాలు అని తెలిపారు.